భార్య మీద కోపం.. మామకు నిప్పంటించి పరారైన అల్లుడు 

11 Oct, 2021 07:58 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాగర్‌ రావు, రమ దంపతులు

కేపీహెచ్‌బీకాలనీ: భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించేందుకు వెళ్లిన ఓ వ్యక్తి.. అడ్డువచ్చిన మామపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పారిపోయాడు. ఈ ఘటనలో మంటలను ఆర్పేందుకు వెళ్లిన అత్తకు కూడా గాయాలయ్యాయి. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన మేరకు.. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీ 6వ ఫేజుకు చెందిన టి. సాగర్‌రావు, రమా దంపతుల కుమార్తె నీతికకు కరీంనగర్‌కు చెందిన సాయికృష్ణతో 2017లో ప్రేమ వివాహం జరిగింది. సంవత్సరం పాటు వీరి సంసారం సంతోషంగా సాగింది. తరువాత భర్త సాయికృష్ణ భార్య నీతికను వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. 

భర్త వేధింపులకు తట్టుకోలేక 2019లో తల్లిదండ్రుల వద్దకు నీతిక వచ్చింది. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో భర్త వేధింపులపై ఫిర్యాదు చేసింది. ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. అప్పటి నుంచి నీతిక తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. అయితే శనివారం రాత్రి 11 గంటల సమయంలో సాయి కృష్ణ పెట్రోల్‌ బాటిల్‌తో ఇంటికి వచ్చాడు. యాసిడ్‌ పోసేందుకు వచ్చాడనుకొని భయపడిని నీతిక బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. నీతిక తండ్రి సాగర్‌రావు... అల్లుడిని అడ్డుకునేందుకు వెళ్లగా అతనిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. 

ఈ ఘటనలో సాగర్‌రావు తీవ్రంగా గాయపడ్డాడు. అత్త రమ మంటలను చూసి అరవటంతో సాయికృష్ణ పరారయ్యాడు. వెంటనే స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా రమకు సైతం గాయాలు అయ్యాయి. దీంతో సాగర్‌ రావు, రమలను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో సాయి కృష్ణకు సైతం గాయాలైనట్లు తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు