నేరాలు చేద్దామని తుపాకీ కొని.. చేయకముందే దొరికిపోయాడు

7 Jan, 2022 08:15 IST|Sakshi

 9 ఎంఎం పిస్టల్, ఆరు బుల్లెట్లు స్వాధీనం 

సాక్షి, హైదరాబాద్‌: దినసరి కూలీతో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తుపాకీ కొనుగోలు చేశాడు. దాంతో దారినపోయే వారిని బెదిరించి దోపిడీలు చేయాలని పక్కా ప్రణాళిక వేశాడు. అయితే అతడి ప్లాన్‌ను రాచకొండ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు పటాపంచలు చేశారు. అక్రమంగా ఆయుధం కలిగి ఉన్న మహ్మద్‌ హుస్సేన్‌ను గురువారం అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి 9 ఎంఎం పిస్టల్, ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. చార్మినార్‌కు చెందిన మహ్మద్‌ హుస్సేన్‌ ఇటీవలే రాజేంద్రనగర్‌ మైలార్‌దేవ్‌పల్లిలోని రోషన్‌ కాలనీకి మకాం మార్చాడు. రోజు వారి కూలీ డబ్బులు చాలకపోవడంతో దోపిడీలు చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి 9 ఎంఎం తుపాకీ, మేగజైన్, ఆరు బుల్లెట్లను కొనుగోలు చేశాడు. అయితే దోపిడీలకు పాల్పడక ముందే ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులకు అతడిపై సమాచారం అందింది. ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చింతలకుంట చెక్‌పోస్ట్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మహ్మద్‌ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి తుపాకీ, ఆరు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఆయుధం ఎవరి నుంచి కొనుగోలు చేశాడు? హుస్సేన్‌ ప్రణాళికలేంటి తదితర అంశాలపై  దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

చదవండి: పోలీస్‌స్టేషన్‌ దగ్గర్లో జంట హత్యలు.. రోడ్డుపై ఒకరిని, ఇంటికెళ్లి మరొకరిని..

మరిన్ని వార్తలు