మహేష్‌ బ్యాంక్‌ సర్వర్‌ హ్యాక్‌ 

25 Jan, 2022 03:34 IST|Sakshi

చెస్ట్‌ ఖాతాలోని రూ.12.4 కోట్ల సొమ్ము మళ్లింపు  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే మహేష్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ సర్వర్‌పై సైబర్‌ నేరగాళ్లు దాడి చేశారు. బ్యాంకు అధికారుల ప్రమేయం లేకుండానే ఇటీవల తెరిచిన మూడు కరెంట్‌ ఖాతాల్లోకి బ్యాంకు చెస్ట్‌ ఖాతా నుంచి రూ.12.4 కోట్లు మళ్లించారు. ఈ విషయం గుర్తించిన బ్యాంకు అధికారులు సోమవారం సిటీ సైబర్‌ క్రై మ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

శని, ఆదివారాల్లో పని కానిచ్చేశారు     
బషీర్‌బాగ్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న మహేష్‌ బ్యాంకుకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖలు ఉన్నాయి. వీటి ఖాతాల నిర్వహణకు సంబంధించిన ప్రధాన సర్వర్‌ బంజారాహిల్స్‌లోని ఓ ప్రై వేట్‌ కార్యాలయం కేంద్రంగా పని చేస్తుంటుంది. అయితే గుర్తు తెలియని సైబర్‌ నేరగాళ్లు దీన్ని హ్యాక్‌ చేశారు. దీని ద్వారా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన సూపర్‌ అడ్మిన్‌యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ సంగ్రహించారు. దీనికి ముందే కొందరు స్థానికుల సహకారంతో నగరంలోని సిద్ధిఅంబర్‌బజార్, అత్తాపూర్‌ల్లో ఉన్న మహేష్‌ బ్యాంకుల్లో ఇటీవల మూడు కరెంట్‌ ఖాతాలు తెరిచారు.

శని, ఆదివారాల్లో బ్యాంకు పని చేయని నేపథ్యంలో అదును చూసుకున్న సైబర్‌ నేరగాళ్లు సూపర్‌ అడ్మిన్‌యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఆధారంగా లాగిన్‌అయి, బ్యాంకు చెస్ట్‌ ఖాతాలోని నగదు రూ.12.4 కోట్లను ఆ మూడు ఖాతాల్లోకి మళ్లించారు. ఆ మూడు ఖాతాల్లోకి వచ్చిన డబ్బును ఉత్తరాదితో పాటు త్రిపుర, అసోం, సిక్కింల్లోని వివిధ బ్యాంకుల్లో తెరిచిన 127 ఖాతాల్లోకి మళ్లించుకుని చాలా వరకు డ్రా చేసేశారు. ఇతర పనుల నిమిత్తం ఆదివారం సాయంత్రం బ్యాంక్‌కు వచ్చిన అధికారులు విషయం తెలుసుకుని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ హ్యాకింగ్‌లో నైజీరియన్ల పాత్ర ఉన్నట్టు భావించి ఆరా తీస్తున్నారు. స్థానికంగా ఖాతాలు తెరిచిన వ్యక్తులను సైబర్‌ క్రై మ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారిస్తూ సూత్రధారులను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నగదు చేరిన ఖాతాల్లో కొన్నింటిని ఫ్రీజ్‌ చేయించారు. వాటిలో రూ.2 కోట్ల వరకు ఉన్నట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు