ఏం ఐడియా రా బాబు.. వంటింటినే ల్యాబ్‌గా మార్చి..

17 Aug, 2021 07:37 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: బాలానగర్‌లో ఉన్న నివాస ప్రాంతంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న సుధాకర్‌ అనే వ్యక్తి అందులో ఆల్ఫాజోలమ్‌ మాదకద్రవ్యం తయారు చేస్తున్నాడు. వంటింటినే ల్యాబ్‌గా మార్చి ఈ నిషేధిత డ్రగ్‌ ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నాడు. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) బృందాలు శని, ఆదివారాల్లో జరిపిన దాడుల్లో ఈ విషయం బహిర్గతమైంది. సుధాకర్‌ సహా అయిదుగురు నిందితుల్ని అరెస్టు చేసిన అధికారులు 3.25 కేజీల మాదకద్రవ్యం, రూ.12.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాయి. 

తడవకు 5 కిలోల చొప్పున.. 
► సుధాకర్‌ స్నేహితుడికి సాధారణ ఔషధాల తయారీకి సంబంధించిన లైసెన్స్‌ ఉంది. బాలానగర్‌కు చెందిన సుధాకర్‌తో కలిసి దీన్ని దుర్వినియోగం చేసిన ఇతగాడు తన కంపెనీ పేరుతో చిన్న పరిమాణంలో ఉన్న ఫ్లాస్క్, రియాక్టర్, డ్రయ్యర్‌ కొనుగోలు చేశాడు. వీటిని సుధాకర్‌ వంటింట్లో బిగించారు. ఆల్ఫాజోలమ్‌ తయారీకి అవసరమైన ముడి పదార్థాలకు వివిధ మార్గాల్లో సేకరిస్తున్న ఈ ద్వయం వాటిని వినియోగించి ఒక్కో తడవకు 4 నుంచి 5 కేజీల ఆల్ఫాజోలమ్‌ తయారు చేస్తోంది. దీన్ని స్థానికంగా ఉన్న ముఠాలతో పాటు కర్ణాటకలోని బెంగళూరు సహా వివిధ ప్రాంతాలకు చెందిన వారికి విక్రయిస్తున్నారు.  

►ఇటీవలే 3.25 కేజీల డ్రగ్‌ ఉత్పత్తి చేసిన సుధాకర్‌ దాన్ని బెంగళూరుకు చెందిన నరేష్‌కు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. సరుకు తీసుకోవడానికి డబ్బు తీసుకుని శనివారం రాత్రి హైదరాబాద్‌కు రమ్మని సూచించాడు. దీనిపై బెంగళూరు ఎన్సీబీ జోనల్‌ యూనిట్‌కు సమాచారం అందింది. అక్కడ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక బృందంతో పాటు హైదరాబాద్‌ సబ్‌–జోనల్‌ యూనిట్‌ అధికారులూ హైదరాబాద్‌–మెదక్‌ రహదారిలోని గండి మైసమ్మ వద్ద ఉన్న ఉజ్వల గ్రాండ్‌ హోటల్‌ సమీపంలో కాపుకాశారు. 

► సరుకు తీసుకుని ఓ కారులో వచ్చిన సుధాకర్‌తో పాటు మరో వ్యక్తిని, మరో కారులో వచ్చిన నరేష్‌ సహా ఇద్దరిని అదుపులోకి తీసుకుని నగదు, డ్రగ్‌ స్వాధీనం చేసుకున్నారు. వీరి విచారణలోనే సుధాకర్‌ ఇంట్లో ఈ డ్రగ్‌ తయారవుతున్నట్లు వెలుగులోకి రావడంతో అక్కడా దాడి చేసి ఉపకరణాలు సీజ్‌ చేశారు. ఈ దందాను మరింత పెంచాలనే విస్తరించాలనే ఉద్దేశంతో సుధాకర్‌ ఇటీవలే తన పక్క ఇంటినీ అద్దెకు తీసుకున్నాడని, అందులో కొత్తగా రియాక్టర్, డ్రయ్యర్‌ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆ ఇంటినీ సీజ్‌ చేసిన ఎన్సీబీ టీమ్‌ ఔషధాల తయారీ లైసెన్స్‌ కలిగిన సుధాకర్‌ స్నేహితుడినీ అరెస్టు చేసింది. బాలానగర్‌లోని ఇంటి కేంద్రంగా దాదాపు అయిదేళ్లుగా ఆల్ఫాజోలమ్‌ తయారీ చేస్తున్నట్లు తేల్చారు.

మరిన్ని వార్తలు