ఉపాధ్యాయుల ఫొటోలను అశ్లీల చిత్రాలుగా మార్చి.. ఆపై

12 Jun, 2021 13:18 IST|Sakshi
నిందితుడు పి.తమిల్‌ సెల్వన్‌

సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్‌నెట్‌ నుంచి సేకరించిన ఫోన్‌ నెంబర్లకు మార్ఫింగ్‌ చేసిన వారి ఫొటోలు పంపిస్తూ బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పతుడున్న చెన్నైకు చెందిన పి.తమిల్‌ సెల్వన్‌ను అనే యువకుడిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సైకియాట్రీ విభాగంలో ఎమ్మెస్సీ చదువుతున్న ఇతగాడు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నేరం చేసినట్లు పోలీసు కమిషనర్‌ మహేష్‌ మురళీధర్‌ భగవత్‌ వెల్లడించారు.  

విద్యా సంస్థల వెబ్‌సైట్లను బ్రౌజ్‌ చేసి...
తమిళనాడులోని రేవతిపురం ప్రాంతానికి చెందిన తమిల్‌ సెల్వన్‌ ఇంటర్‌నెట్‌లోని అనేక వెబ్‌సైట్లను బ్రౌజ్‌ చేసేవాడు. ప్రధానంగా విద్యా సంస్థల వెబ్‌సైట్లలోకి ప్రవేశించే ఉపాధ్యాయుల నెంబర్లు సేకరిస్తాడు. వాటిని తన ఫోన్‌లో సేవ్‌ చేసుకోవడంతో పాటు వివిధ సాఫ్ట్‌వేర్స్‌ వాడి యజమానుల ఫొటోలు సంగ్రహిస్తాడు. వివిధ రకాలైన యాప్స్‌ను వినియోగించి ఈ ఫొటోలను అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్‌  చేస్తాడు. ఆ తర్వాత వాటిని ఆ ఉపాధ్యాయులకే పంపిస్తాడు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో పెట్టకుండా ఉండాలంటే తాను కోరిన మొత్తం క్రిప్టో కరెన్సీ రూపంలో పంపాలని బెదిరిస్తాడు.

రాచకొండ పరిధిలోని ఓ ప్రముఖ విద్యా సంస్థలో పని చేసే ఓ ఉపాధ్యాయురాలికి ఇటీవల టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా మార్ఫింగ్‌ చేసిన ఫొటో వచ్చింది. ఆపై ఆమెకు ఫోన్‌ చేసిన సెల్వన్‌ అభ్యంతరకరంగా మాట్లాడుతూ బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇతగాడు తన ఉనికి బయటపడకుండా ఉండటానికి వీపీఎన్‌ సహా వివిధ రకాలైన పరిజ్ఞానాలు వినియోగించాడు. అయినప్పటికీ సాంకేతికంగా ముందుకు వెళ్లిన పోలీసులు నిందితుడైన సెల్వన్‌ను గుర్తించి అరెస్టు చేసి తీసుకువచ్చారు.

చదవండి: Blackmail: ‘న్యూడ్‌ కాల్‌ చేస్తావా.. ఫొటోస్‌ అప్‌లోడ్‌ చేయలా?’

మరిన్ని వార్తలు