ముందుగా బేరం.. కానీ మధ్యలో రూ. 5 వేలు చోరీ చేసిందని చంపేశాడు!

1 May, 2022 16:52 IST|Sakshi

సాక్షి,వనస్థలిపురం(హైదరాబాద్‌): మీర్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలోని లోకాయుక్త కాలనీలో ఇటీవల వెలుగు చూసిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన డబ్బులు ఐదు వేల రూపాయలను చోరీ చేయడంతో కోపోద్రిక్తుడై ఓ యువకుడు బండరాయితో తలపై మోది ఆమెను హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... యాకుత్‌పురా చంద్రనగర్‌కు చెందిన మాదారు ఉషయ్య అనురాధ (42) ఇళ్లల్లో పని చేస్తోంది.

ఏప్రిల్‌ 24న రాత్రి 11 గంటలకు ఆమె సంతోష్‌నగర్‌ ఐఎస్‌సదన్‌ వద్ద నిలబడి ఉండగా బడంగ్‌పేట శ్రీవిద్యానగర్‌ టౌన్‌షిప్‌లో అద్దెకు ఉండే మహబూబ్‌నగర్‌ తిరుమలగిరి పెద్దబావి తండాకు చెందిన సెంట్రింగ్‌ కార్మికుడు జార్పుల మాంజానాయక్‌ (27) అక్కడికి వచ్చాడు. తనతో గడిపితే రూ.1000 లు ఇస్తానని బేరం కుదుర్చుకొని అనురాధను తన గదికి తీసుకెళ్లాడు. చెప్పినట్టే రూ.వెయ్యి చెల్లించాడు. అనంతరం అనురాధ మాంజా నాయక్‌ పర్స్‌ నుంచి రూ.5 వేలు తీసుకుని పారిపోతుండగా నాయక్‌ ఆమెను వెంబడించి బడంగ్‌పేట లోకాయుక్త కాలనీలోని ఒక ఓపెన్‌ ప్లాట్‌ వద్ద పట్టుకున్నాడు. తన డబ్బులు ఇవ్వాలని అడుగగా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన నాయక్‌ ఆమెను తోసివేసి బండరాయితో తలపై మోది హత్యచేసి పరారయ్యాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా మాంజా నాయక్‌ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతను నేరాన్ని ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్య కేసును త్వరగా ఛేదించిన మీర్‌పేట  ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి, డీఐ రామకృష్ణ, ఇతర సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

చదవండి: Hyderabad Gang Rape: ఒంటరి మహిళపై సామూహిక అ‍త్యాచారం

మరిన్ని వార్తలు