ఫేస్‌బుక్‌ చాటింగ్‌.. మార్ఫింగ్‌ చేసిన వీడియోలతో బ్లాక్‌ మెయిల్‌ 

22 Apr, 2022 08:29 IST|Sakshi

సాక్షి,బంజారాహిల్స్‌: ఫేస్‌బుక్‌ చాటింగ్‌ ద్వారా టచ్‌లోకి వచ్చిన ఓ అపరిచితుడు మార్పింగ్‌ చేసిన వీడియోలు పంపిస్తూ బ్లాక్‌మెయిన్‌ చేస్తున్న ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న రాజీవ్‌ అనే వ్యక్తి ఓ ప్రైవేటు సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. దీంతో పాటు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అతడి ఫేస్‌బుక్‌ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి పరిచయం అయ్యాడు. ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాలని కోరాడు. దాంతో అతడికి రాజీవ్‌ తన నెంబర్‌ ఇచ్చారు.

కొన్నిరోజుల తర్వాత రాజీవ్‌ ఫేస్‌బుక్‌లో ఉన్న కొన్ని ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వాటిని వేరొకరి శరీరాలతో కలిసి వీడియోలు తయారు చేసిన దుండగులు అతడిని బ్లాక్‌ మెయిల్‌ చేయడం ప్రారంభించారు. తమకు డబ్బులు ఇవ్వాలని లేకుంటే ఫేస్‌బుక్‌లోని స్నేహితుల గ్రూపులకు షేర్‌ చేస్తామని బెదిరించారు. దీంతో రూ. 3469 చొప్పున మూడుసార్లు పంపించినా ఇదే తీరులో బ్లాక్‌మెయిల్‌ చేస్తుండటంతో బాధితుడు రాజీవ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
చదవండి👉🏻 కొత్త సినిమా లింకులని కక్కుర్తిపడితే.. ఖేల్‌ ఖతం

మరిన్ని వార్తలు