మోసగించడంలో మనోడిది నయా ట్రెండ్‌.. ప్రకటనలే పెట్టుబడి

9 Aug, 2021 08:27 IST|Sakshi
నాగరాజు

సాక్షి, సిటీబ్యూరో: రియల్‌ఎస్టేట్‌ ప్రకటనల ఆధారంగా పలువురిని మోసంచేసిన నిందితుడిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడు ఖమ్మం జిల్లా చిన్నారానికి చెందిన ఎస్‌.నాగరాజుగా గుర్తించారు. వివరాలు.. గతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసిన నాగరాజు తీవ్రంగా నష్టపోయాడు. దీంతో ఆ పేరుతోనే మోసాలకు చేయాలని నిర్ణయించుకున్నాడు. 99ఎకర్స్‌.కామ్, ఓఎల్‌ఎక్స్‌ యాప్‌లతో పాటు వివిధ క్లాసిఫైడ్స్‌తో స్థలాల విక్రయం పేరుతో ఉన్న ప్రకటనల్ని  చూసేవాడు.

వారికి ఫోన్‌చేసి ఆ స్థిరాస్తిని తాను ఖరీదు చేయాలని భావిస్తున్నట్లు చెప్పి బయానాగా కొంత చెల్లించి వాట్సాప్‌ ద్వారా పత్రాలు షేర్‌ చేయించుకునే వాడు. ఆపై రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు చెందిన బోర్డులపై ఉన్న రియల్టర్ల నెంబర్లు సేకరించి వారికి ఫోన్లు చేసి తానే సదరు స్థలానికి యజమానినంటూ పరిచయం చేసుకునేవాడు.  తక్కువ ధరకు విక్రయించేస్తున్నట్లు చెప్పి పత్రాలు షేర్‌ చేసేవాడు. నిజమేనని నమ్మిన రియల్టర్లు అగ్రిమెంట్‌ చార్జీలు, అడ్వాన్సులు, ఇతర ఖర్చుల పేరుతో రూ.లక్షల్లో తన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకునే వాడు. ఇలా వచ్చిన డబ్బుతో  జల్సాలు చేసేవాడు.

తరువాత అసలు యజమానుల్ని సంప్రదించి స్థిరాస్తి ఖరీదు చేయలేకపోతున్నానని చెప్పి వారి పత్రాలను వాట్సాప్‌ ద్వారా తిప్పిపంపి బయానాగా చెల్లించినదీ వెనక్కు తీసుకునేవాడు. ఇలా చైతన్యపురి, మీర్‌పేట్‌లతో పాటు సైబర్‌ క్రైమ్‌ ఠాణాలోనూ పది కేసులు నమోదయ్యాయి. దీంతో ఏసీపీ ఎస్‌.హరినాథ్‌ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రాము రంగంలోకి దిగారు. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడు నాగరాజుగా గుర్తించి అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు