Fraudsters Cheating: పార్ట్‌ టైం జాబ్‌ కావాలా అని కాల్‌ చేసి.. చివరికి..

8 Apr, 2022 15:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,హిమాయత్‌నగర్‌: డేటా ఎంట్రీ ఉద్యోగం ఎదురు చూస్తున్న విద్యార్థికి భారీ టోకరా వేశారు సైబర్‌ నేరగాళ్లు. క్విక్కర్‌ డాట్‌కామ్‌లో రెజ్యూమ్‌ని చూసిన సైబర్‌ నేరగాళ్లు హబ్సిగూడకు చెందిన వినీత్‌ అనే విద్యార్థికి కాల్‌ చేశారు. ఇంటి వద్దనే ఉంటూ డేటా ఎంట్రీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. అందుకు గాను భారీ మొత్తంలో డబ్బు కూడా ఇస్తామన్నారు. దీనికి ఆశపడ్డ వినీత్‌ వారు చెప్పిన దానికి ఓకే అన్నాడు. ముందుగా రూ. 3 వేలు ప్రాసెసింగ్‌ ఫీజు కింద కట్టించుకున్నారు. ఆ తర్వాత 300 పేజీల డేటా ఎంట్రీ వర్క్‌ ఇచ్చారు.

ఈ వర్క్‌ క్వాలిటీ చెక్‌ చేసేందుకు, ఓకే చేసేందుకు గాను రూ. 6 వేలు తీసుకున్నారు. ఆ తర్వాత చేసే ప్రతి వర్క్‌లో కమీషన్‌ 18 శాతం ఇవ్వాలంటూ ముందుగానే రూ. 13 వేలు, రూ. 20 వేలు, రూ. 30 వేలు చొప్పున తీసుకున్నారు. నెలల పాటు చేసిన వర్క్‌కు సంబంధించిన డబ్బు ఇవ్వాలని వినీత్‌ కోరగా.. దానికి కమీషన్‌ ఇస్తేనే వస్తుందన్నారు. ఇలా పలు దఫాలుగా విద్యార్థి నుంచి రూ. 10.43 లక్షలను కాజేశారు. చివరకు తాను మోసపోయానని గుర్తించిన సదరు వినీత్‌ గురువారం సిటీ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.

చదవండి: వైరల్‌గా మారిన క్రాంతిదాస్‌ ఫొటోలు.. ఇంతకీ ఆమె ఎవరు!

మరిన్ని వార్తలు