సర్కారు గొర్రెల్ని తీసుకొని.. లాభాలు పంచుకుందామంటూ..

15 Apr, 2022 08:26 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

వచ్చిన దాంట్లో పెద్ద మొత్తంలో కమీషన్‌ ఇస్తాం

ఎల్లారెడ్డిగూడ వాసికి ఎర వేసిన కొందరు వ్యక్తులు

రూ.75 లక్షలు తీసుకుని టోకరా 

సీసీఎస్‌లో కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న గొర్రెలు, బర్రెల్ని అడ్డదారిలో సొంతం చేసుకుని, వాటిని మార్కెట్‌లో అమ్మేసి వచ్చిన లాభాలు పంచుకుందామంటూ ఎల్లారెడ్డిగూడకు చెందిన వ్యక్తి నుంచి కొందరు రూ.75 లక్షలు తీసుకున్నారు. చివరకు తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సిటీ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఎల్లారెడ్డిగూడలోని నవోదయ కాలనీలో నివసించే బాధితుడికి సనత్‌నగర్‌లో నివసించే కె.అర్వింద్‌కుమార్‌తో పదేళ్లుగా పరిచయం ఉంది.

గతేడాది ఫిబ్రవరి 15న అర్వింద్‌ ద్వారా చౌదరిగూడకు చెందిన ఎస్‌.శ్రీనివాస్‌రావుతో బాధితుడిని పరిచయమైంది. శ్రీనివాస్‌ ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ పశువైద్యశాలలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. తెలంగాణ వెటర్నరీ డాక్టర్స్‌ అసోసియేషన్‌ నాయకుడిగానూ ఉన్న శ్రీనివాస్‌కు మంచి పలుకుబడి ఉందంటూ అర్వింద్‌ బాధితుడితో చెప్పాడు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం కావడంతో శ్రీనివాస్‌కు రూ.కోటి అవసరం ఉందని చెప్పాడు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సబ్సిడీపై బర్రెలు, గొర్రెలు అందించే పథకం మార్చ్‌ 31తో ముగుస్తుందని చెప్పాడు.
చదవండి: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. అరగంటకో ఎంఎంటీఎస్‌

అయితే అనేక గ్రామాల్లోని రైతులు మార్జిన్‌ మనీ కట్టలేకపోయారని, వారి తరఫున మనమే కడదామంటూ ఎర వేశాడు. ఆ స్కీమ్‌లో వచ్చిన బర్రెలు, గొర్రెల్ని మార్కెట్‌లో ఎక్కువ రేటుకు అమ్మి సొమ్ము చేసుకుందామన్నారు. అలా వచ్చిన లాభాలను పంచుకుందామంటూ ఎర వేశారు. వీరి మాటలు నమ్మిన బాధితుడు శ్రీనివాస్‌తో పాటు ఆయన భార్య లక్ష్మికి రూ.58 లక్షలు నగదు రూపంలో ఇచ్చాడు. మరో రూ.17 లక్షలు ఆర్టీజీఎస్‌ ద్వారా లక్ష్మి ఖాతాకు బలీ చేశాడు.

ఆ సందర్భంలో శ్రీనివాస్‌ ఏడు చెక్కులతో పాటు బాండ్‌ పేపర్‌ అందించాడు. అప్పట్లో నిందితులు చెప్పిన దాని ప్రకారం గతేడాది ఏప్రిల్‌లోనే అసలు, లాభాలు బాధితుడుకి ఇవ్వాల్సి ఉంది. అప్పటి నుంచి డబ్బు ఇవ్వకుండా వాయిదాలు వేస్తుండటంతో ఇటీవల బాధితుడు శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లగా తాళం వేసుంది. అతడి వివరాలు చెప్పాలంటూ అనిల్‌ను కోరగా బెదిరింపులు ఎదురయ్యాయి. దీంతో బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. శ్రీనివాస్, అర్వింద్, లక్ష్మీ తదితరులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: మొక్కలకు నీరు పడుతుండగా దూసుకొచ్చిన మృత్యువు 

మరిన్ని వార్తలు