Hyderabad: విజిటర్‌గా దుబాయ్‌కు వెళ్లి... జల్సాలకు డబ్బంతా ఖర్చు అవ్వడంతో

2 Nov, 2022 09:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పర్యాటక వీసాపై దుబాయ్‌ వెళ్లిన గోల్కొండ వాసి చేతిలో ఉన్న డబ్బంతా అక్కడ జల్సాలకు ఖర్చు చేశాడు. తిరిగి రావడానికి ఇతడి వద్ద డబ్బు లేదనే విషయం గమనించిన అక్కడి సూత్రధారులు గోల్డ్‌ స్మగ్లింగ్‌లో క్యారియర్‌గా మార్చారు. కేజీ బంగారం అక్రమ రవాణా చేస్తూ వచ్చిన ఇతడితో పాటు రిసీవర్‌ను, అతడి సహాయకులైన ఇద్దరినీ దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరి వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ చక్రవర్తి గుమ్మి మంగళవారం వెల్లడించారు. బడాబజార్‌కు చెందిన మహ్మద్‌ ఖాజా మొయినుద్దీన్‌ ఇటీవల దుబాయ్‌కు విజిట్‌ వీసాపై వెళ్లాడు.

తన వద్ద ఉన్న నగదు మొత్తం అక్కడే ఖర్చు పెట్టేయడంతో తిరుగు ప్రయాణానికి టిక్కెట్టు, ఖర్చులకు డబ్బు లేని పరిస్థితి నెలకొంది. దీనిని గుర్తించిన ముస్తఖీమ్‌ అనే దుబాయ్‌ వాసి అతడికి వల వేశాడు. తాము చెప్పినట్లు కేజీ బంగారం స్మగ్లింగ్‌ చేస్తే విమాన టిక్కెట్లతో పాటు కొంత డబ్బు ఇస్తానని చెప్పాడు. అందుకు ఖాజా అంగీకరించడంతో మూడు గోళాలుగా నల్ల కవర్లలో ప్యాక్‌ చేసిన కేజీ బంగారం, టిక్కెట్టు, డబ్బు ముస్తఖీమ్‌ అందించాడు. ఆ బంగారాన్ని తీసుకుని విమానాశ్రయంలో దిగిన తర్వాత ఫోన్‌ ఆన్‌ చేయాలని, దుబాయ్‌ నెంబర్‌ నుంచి కాల్‌ చేసిన వ్యక్తికి సరుకు అందించాలని సూచించాడు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగిన ఖాజాకు కర్ణాటకలోని భత్కల్‌ ప్రాంతానికి చెందిన రయీస్‌ అహ్మద్‌ సయీద్‌ హుస్సేన్‌ లంక అనే వ్యక్తి ఫోన్‌ చేశాడు. తాను ఎయిర్‌పోర్టులోనే ఉన్నానంటూ రప్పించి తన కారులో ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో లంకతో పాటు అదే ప్రాంతానికి చెందిన సరిమ్‌ హుస్సేన్, ఫౌజాన్‌ కూడా ఉన్నారు. దీనిపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు ఎన్‌.శ్రీశైలం, వి.నరేందర్, షేక్‌ బుర్హాన్, కె.నర్సింహ్ములు తమ బృందంతో దాడి చేసి నలుగురినీ పట్టుకున్నారు.

వీరి నుంచి స్వాదీనం చేసుకున్న బంగారంతో సహా కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. ఖాజా ఈ బంగారాన్ని రిక్టమ్‌ కన్సీల్‌మెంట్‌ విధానంలో తీసుకువచ్చాడు. ఇలా కేజీ బంగారం మలద్వారంలో దాచి తేవడం సాధారణ వ్యక్తులకు సాధ్యం కాదు. తరచు ఈ దందా చేసే స్మగ్లర్లు మాత్రమే ప్రత్యేక శస్త్ర చికిత్స ద్వారా ఇలా చేయగలరు. ఈ కోణంలోనూ అధికారులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు