లాభాలు రాకపోయినా పెట్టుబడి.. నిండా ముంచిన క్రిప్టో.. రూ.27 లక్షలు టోకరా

30 Nov, 2022 10:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తొలుత రూ.10వేలు క్రిప్టోలో పెట్టుబడి పెట్టాడు. దీనికి ఒక్క రూపాయి లాభం రాలేదు. ఆ తర్వాత రూ.20వేలు పెట్టాడు, దీనికి లాభాలు రాలేదు. మళ్లీ ఒకేసారి రూ.80వేలు పెట్టాడు.. దీనికి కూడా ఒక్క రూపాయి రాలేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా కోటీశ్వరుడిని కావాలనే ఆశతో రూ.లక్షలు ముట్టజెప్పాడు. తీరా మోసపోయానని గ్రహించి పోలీసు స్టేషన్‌ మెట్లు ఎక్కాడు ఓ వ్యక్తి. గాంధీనగర్‌కు చెందిన శ్రీనివాస్‌ ఫోన్‌ నంబర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు టెలిగ్రామ్‌ గ్రూప్‌లో యాడ్‌ చేశారు. తాము చెప్పినట్లు చేస్తే తక్కువ టైంలో కోటీశ్వరుడిని చేస్తామంటూ మాయ మాటలు చెప్పారు.

అందుకు అంగీకరించిన శ్రీనివాస్‌ పైన చెప్పుకున్న విధంగా పెట్టుబడి పెట్టుకుంటూ పోయాడు. రూ.80వేల తర్వాత ఒకేసారి రూ.2.50 లక్షలు పెట్టాడు. దీనికి లాభాలు కనిపించాయి, తీసుకునేందుకు వీలు లేకుండా ఆ డబ్బును సైబర్‌ నేరగాళ్లు ఫ్రీజ్‌ చేశారు. లాభాలు వస్తున్నాయి కదా అని అత్యాశకు పోయి పలు దఫాలుగా రూ.27లక్షలు పెట్టాడు. ఒక్క రూపాయి కూడా తీసుకునేందుకు రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి మంగళవారం సిటీసైబర్‌ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో కీలక పరిణామం  : 

మరిన్ని వార్తలు