మత్తిచ్చి.. రెండ్రోజులపాటు కీచకపర్వం!

16 Sep, 2022 02:47 IST|Sakshi
నిందితుల వివరాలను వెల్లడిస్తున్న మీర్‌చౌక్‌ ఏసీపీ ప్రసాద్‌ రావు 

కారులో ఎత్తుకెళ్లి బాలికపై ఇద్దరు యువకుల కిరాతకం 

కూల్‌డ్రింక్‌లో మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చి సామూహిక అత్యాచారం 

రెండు లాడ్జీల్లో తిప్పుతూ దారుణానికి ఒడిగట్టిన వైనం 

హైదరాబాద్‌ పాతబస్తీలో ఘోరం ∙చివరకు రోడ్డు పక్కన వదిలేసి పరార్‌ 

నిందితుల అరెస్ట్‌.. పోక్సో చట్టం కింద కేసు 

డబీర్‌పురా: హైదరాబాద్‌ పాతబస్తీలో ఘోరం చోటుచేసుకుంది. రాత్రి వేళ ఇంటి సమీపంలోని ఓ మందుల షాప్‌కు వెళ్లిన మైనర్‌ బాలిక (14)ను ఇద్దరు యువకులు కిడ్నాప్‌ చేసి ఆమెకు మత్తుమందు ఇచ్చి ఏకంగా రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం సృష్టించింది. రెండు నెలల కిందట సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌రేప్‌ ఉదంతాన్ని మరచిపోక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీర్‌చౌక్‌ ఏసీపీ ప్రసాద్‌రావు... డబీర్‌పురా ఇన్‌స్పెక్టర్‌ కోటేశ్వర్‌రావు, ఎస్సైలతో కలిసి నిందితుల వివరాలను వెల్లడించారు. డబీర్‌పురా ప్రాంతానికి చెందిన మైనర్‌ బాలిక (14) తొమ్మిదో తరగతి మధ్యలోనే ఆపేసి ఇంట్లోనే ఉంటోంది. ఈ నెల 12న రాత్రి 8 గంటల సమయంలో తన తల్లి కాస్త అస్వస్థతకు గురికావడంతో మందులు తీసుకొచ్చేందుకు ఇంటి సమీపంలోని మందుల దుకాణానికి వెళ్లింది.

అదే సమయంలో రెయిన్‌బజార్‌ షా కాలనీకి చెందిన సయ్యద్‌ నైమత్‌ అహ్మద్‌ (26), సయ్యద్‌ రవిష్‌ అహ్మద్‌ మెహదీ (20) క్వాలిస్‌ కారు (ఏపీ28 డీబీ 2729)లో అక్కడకు చేరుకున్నారు. సయ్యద్‌ రవిష్‌ స్కూల్‌ డ్రాపవుట్‌ కాగా సయ్యద్‌ నైమత్‌ సౌదీ అరేబియాలో కళ్లద్దాల దుకాణం నిర్వహిస్తూ ఇటీవలే నగరానికి వచ్చాడు. రవిష్‌ బాలికకు పరిచయస్తుడే. వారు మాయమాటలు చెప్పి బాలికను కారులో ఎక్కించుకొని తొలుత నాంపల్లిలోని సృజన ఇన్‌ లాడ్జికి తీసుకెళ్లారు.

అనంతరం బాలికకు కూల్‌డ్రింక్‌లో మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మర్నాడు త్రీ క్యాజిల్స్‌ డీలక్స్‌ లాడ్జికి తరలించి మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి 12న అర్ధరాత్రి దాటాక డబీర్‌పురా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ నెల 14న బాలిక తల్లికి ఫోన్‌ చేసిన నిందితులు.. బాలిక తమ వద్దే ఉందని చెప్పి ఆమెను చాదర్‌ఘాట్‌–ఎంజీబీఎస్‌ నాలా వద్ద విడిచిపెట్టి పరారయ్యారు.

దీనిపై సమాచారం అందుకున్న డబీర్‌పురా పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. నిందితుల ఫోన్‌ నంబర్‌ ఆధారంగా సయ్యద్‌ నైమత్‌ అహ్మద్, సయ్యద్‌ రవిష్‌ అహ్మద్‌ మెహదీలను అరెస్టు చేయడంతోపాటు వారు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కిడ్నాప్, గ్యాంగ్‌రేప్‌ కేసులతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే లాడ్జీల గదుల నుంచి ఫోరెన్సిక్‌ ఆధారాలను సేకరించారు. అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. కాగా, తమ కుమార్తె చేతిపై ఇంజక్షన్లు ఇచ్చిన గుర్తులు ఉన్నట్లు బాధితురాలి తల్లి పేర్కొంది.  

మరిన్ని వార్తలు