భర్త ఇంటికి వచ్చి కాలింగ్‌ బెల్‌ కొట్టినా డోర్‌ తీయలేదు.. లోపల వెళ్లి చూస్తే

28 Jul, 2023 13:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చిలకలగూడ(హైదరాబాద్‌): కాళ్లపారాణి ఆరకముందే నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ మట్టంరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్‌ ఖానాపూర్‌కు చెందిన విజయకుమార్‌ నగరంలోని స్టాఫ్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. అతడికి అదే ప్రాంతానికి చెందిన నందిని (23)తో నెలన్నర క్రితం వివాహం జరిగింది. నూతన దంపతులు చిలకలగూడ ఠాణా పరిధిలోని పద్మారావునగర్‌లో నివాసం ఉంటున్నారు.

ఆషాఢమాస నేపథ్యంలో పుట్టింటికి వెళ్లిన నందిని ఈనెల 22న పద్మారావునగర్‌కు తిరిగి వచ్చింది. ఈనెల 26న రాత్రి నైట్‌ డ్యూటీకి వెళ్లిన విజయకుమార్‌ గురువారం ఉదయం ఇంటికి వచ్చి కాలింగ్‌ బెల్‌ కొట్టినా స్పందన లేకపోవడంతో స్థానికుల సహాయంతో తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా నందిని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. తమ కుమార్తె కొంత కాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతుందని, అదే కారణంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని మృతురాలి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

చదవండి   Tomato Truck Over Turned: టమాటా లారీ బోల్తా..! క్షణాల్లోనే ఊడ్చుకెళ్లారు..!!

మరిన్ని వార్తలు