యూకే నుంచి బహుమతి అంటూ... రూ.18 లక్షలు స్వాహా

18 Apr, 2021 11:57 IST|Sakshi

సాక్షి, నాగోలు: యూకే నుంచి బహుమతి పార్శిల్‌  వచ్చిందని, దానిని మీకు ఇవ్వాలంటే ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు చార్జీలు చెల్లించాలని నమ్మించి రూ.18 లక్షలు కాజేసిన ఘటనలో ఇద్దరు వ్యక్తులను శనివారం రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నైజీరియాకు చెందిన హెన్రీ చుక్వుని ఒపెరా మెడికల్‌ వీసాపై భారత్‌ వచ్చి కర్టాటకకు చెందిన మహిళను వివాహం చేసుకుని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం గౌతమ్‌ బుద్ద నగర్‌లో నివాసం ఉంటున్నాడు. న్యూఢిల్లీలో ఫుట్‌బాల్‌ కోచ్‌గా పనిచేసే వ్యక్తితో నైజీరియా జాతీయుడి పరిచయం చేసుకున్నాడు.

ఆన్‌లైన్‌ మోసాలకు అలవాటు పడ్డారు

హెన్రీ ఫుట్‌బాల్‌ ఆడటానికి వచ్చేవాడు. అక్కడే ఉండే మరోక నైజీరియా చెందిన చీమా ఫ్రాంక్‌ను ఇతర స్నేహితులకు పరిచయం చేశాడు. అందరూ కలసి ఆన్‌లైన్‌ బహుమతి మోసాలు, ఉద్యోగ మోసాలు, రుణ మోసాలు పాల్పడి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఆన్‌లైన్‌ మోసాలు చేయడం ప్రారంభించారు. బహుమతులు పంపే నెపంతో నగరంలోని ఓ వ్యక్తికి హెన్రీ చుక్వుని ఒపెరా మెసేజ్‌ పెట్టాడు. యూకే నుంచి కరెన్సీలో పెద్ద మొత్తంలో బహుమతి వచ్చింది.. ఢిల్లీ విమానాశ్రమంలో ఉంది. దానిని మీకు పంపించాలంటే కస్టమ్‌ అధికారులకు ప్రాసెసింగ్‌  చార్జీలు చెల్లించాలని స్థానికంగా ఉండే నోయిడాకు చెందిన ఆటో డ్రైవర్‌ సూరజ్‌ బ్యాంకు ఖాతాల్లో రూ. 18 లక్షలు నగదు బదిలీ చేయించుకున్నారు. ఆటో డ్రైవర్‌కు రూ. 55 వేలు నగదు అందజేశాడు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో హెన్రీ చుక్వుని ఒపెరా, ఆటో డ్రైవర్‌ సూరజ్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకుని శనివారం రిమాండ్‌కు తరలించారు. 

( చదవండి: సైబర్‌ నేరగాళ్ల చేతి వాటం.. రూ.1.2 లక్షలు స్వాహా )

మరిన్ని వార్తలు