చార్జ్‌షీట్‌ దాఖలు: రూ.11 వేల కోట్ల లాభం పొందిన యాప్‌లు

28 May, 2021 11:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌లో యువతను లక్ష్యంగా చేసుకుని రుణాలు ఇచ్చి వేధించిన కేసులో చార్జ్‌షీట్‌ దాఖలైంది. దీనిపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఆన్‌లైన్‌ రుణ యాప్‌లను షాంఘైలో రూపొందించినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ల్యాంబో సహా 28 మంది అరెస్టయ్యారు. అయితే ప్రధాన సూత్రధారి జెన్నిఫర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగుళూరు, ముంబై, ఢిల్లీలో అధికంగా బాధితులు ఉన్నారు.

ఈ రుణ యాప్‌ల నిర్వాహకుల వేధింపులు తాళలేక తెలంగాణలో ఏడుగురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చైనాలో ఓ ప్రైవేట్ కంపెనీలో కన్సల్టెంట్లుగా పని చేస్తున్న జెన్నిఫర్, వాంగ్ జియాంగ్ ఇద్దరు కలిసి 2019 నవంబర్‌లో ఢిల్లీలో మూడు సంస్థలు ప్రారంభంచారు. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్‌లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి రుణాల ఇస్తామని యువతను ఆకర్షించారు.

వీరిలో జియాంగ్‌ బెంగళూరు బాధ్యతలు చూసుకున్నాడు. గతేడాది లాక్‌డౌన్‌కు ముందు చైనాకు జియాంగ్ పరార్‌. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై బాధ్యతలు ల్యాంబోకు అప్పగించి జెన్నిఫర్ వెళ్లారు. ఆన్‌లైన్‌ లోన్ యాప్‌లతో 7 నెలల్లో రూ.30 వేల కోట్లు లావాదేవీలు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీటిలో రూ.11 వేల కోట్ల లాభం పొందారు. వచ్చిన లాభంతో ఐల్యాండ్‌లో ఉన్న బినామీ ఖాతాలోకి నగదు బదిలీ దశల వారీగా వందల కోట్ల రూపాయలు షాంఘైకు తరలించారు. ఒక్కరోజులో రూ.250 కోట్లు రుణంగా నిర్వాహకులు ఇచ్చారు. నిర్వాహకుల ఖాతా నుంచి రూ. 315 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు.

మరిన్ని వార్తలు