ఔటర్‌ రింగురోడ్డుపై ఘోర ప్రమాదం.. అరగంటలో ఇంటికి చేరుకుంటామనేలోపు ప్రాణాలు గాల్లో..

1 Nov, 2022 10:47 IST|Sakshi

మేడ్చల్‌రూరల్‌: శ్రీశైలంలో వెళ్లి వస్తున్న భక్తులు మరో అరగంటలో తమ ఇళ్లకు చేరుకుంటామనుకునేలోపు డ్రైవర్‌ నిద్ర మత్తు ఘోర రోడ్డు ప్రమాదానికి దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన శంకర్‌గుప్త, చిట్కూల్‌ గ్రామానికి చెందిన సురేశ్‌ గుప్త కుటుంబసమేతంగా ఆదివారం తెల్లవారుజామున గుమ్మడిదల నుంచి వింగర్‌ వాహనంలో డ్రైవర్‌ నర్సింహారెడ్డితో కలిసి మొత్తం 12 మంది శ్రీశైలం బయలుదేరారు.

స్వామి వారి దర్శనం అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. మరో అరగంటలో తమ ఇళ్లకు చేరకుంటామనుకునేలోగా వారు ప్రయాణిస్తున్న వింగర్‌ వాహనం డ్రైవర్‌ నర్సింహారెడ్డి నిద్రమత్తులో ఔటర్‌ రింగురోడ్డుపై మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కండ్లకోయ వద్ద ముందు వెళ్తున్న కంటైనర్‌ వాహనాన్ని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. కంటైనర్‌ను ఢీకొట్టిన వాహనం డివైడర్‌పైకి దూసుకెళ్లింది.
(చదవండి: 'నాన్నా అమ్మను రోజూ ఎందుకు కొడతావు.. మాతో ఎందుకు సంతోషంగా ఉండవు')

ఈ ఘటనలో డ్రైవర్‌ నర్సింహారెడ్డి(28), శంకర్‌గుప్త(46), సురేశ్‌గుప్త(45) అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంలో ఉన్న 9 మందిలో 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు సికింద్రాబాద్‌ య శోద ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వీరిలో ఇద ్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు శంకర్‌ గుప్త భార్య కాలు విరగ్గా, కుమార్తె ఊపిరితిత్తుల్లోకి నీరు చేరినట్లు సమాచారం.  

మేడ్చల్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ విశ్రాంతి లేకుండా వాహనం నడపడంతో నిద్రమత్తుకు గురికావడం, అతివేగం ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని సీఐ తెలిపారు. 
(చదవండి: పెళ్లైన విషయం దాచి.. ఒకేసారి ఇద్దరు విద్యార్థినిలను కిడ్నాప్‌చేసి సహజీవనం)

మరిన్ని వార్తలు