కరీంనగర్‌లో తీగ... ఫలక్‌నుమాలో డొంక

26 Feb, 2021 08:35 IST|Sakshi

గన్‌పౌడర్‌ వినియోగించి డిటొనేటర్ల తయారీ 

ఇద్దరు నిందితుల అరెస్టు  

చంద్రాయణగుట్ట: దీపావళి టపాసులు తయారు చేయడానికి వినియోగించి గన్‌పౌడర్‌తో తక్కువ సామర్థ్యం కలిగిన డిటొనేటర్లు తయారు చేస్తున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. కరీంనగర్‌లో  పట్టుబడిన ఇద్దరి విచారణలో వీటి మూలాలు ఫలక్‌నుమాలో ఉన్నట్లు తేలాయి. సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈది బజార్‌కు చెందిన మహ్మద్‌ జైనుల్లా హబీబ్‌ అలియాస్‌ షబ్బీర్‌కు గతంలో గన్‌పౌడర్‌ తయారీకి సంబంధించి లైసెన్స్‌ ఉండేది. బొగ్గు, అమ్మోనియం నైట్రేట్, సోడియం సల్ఫేట్‌ తదితరాలను కలిపి దీనిని తయారు చేసే అతగాడు టపాసుల తయారీదారులకు విక్రయించేవాడు.  

రెయిన్‌బజార్‌ కేంద్రంగా ఈ వ్యాపారం  చేయడానికి కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ జారీ చేసిన దీని కాల పరిమితి 2018లో ముగిసింది. ఆ తర్వాత దాన్ని షబ్బీర్‌ రెన్యువల్‌ చేయించుకోలేదు. అయితే అప్పటికే అతడి వద్ద కొంత ముడిసరుకు మిగిలిపోయింది. ఫాతీమానగర్‌లో బొగ్గు విక్రయానికి లైసెన్స్‌ కలిగిన హమీద్‌ ఖాన్‌తో కలిసి ఆ ప్రాంతంలోనే దీన్ని అక్రమంగా తయారు చేయడం మొదలెట్టాడు. నిర్మాణ రంగంలో అక్రమ పేలుళ్ల కోసం డిటొనేటర్లకు భారీ డిమాండ్‌ ఉందని తెలుసుకున్న షబ్బీర్‌ గన్‌పౌడర్‌ వినియోగించి తక్కువ సామర్థ్యం కలిగిన డిటోనేటర్లను తయారు చేస్తున్నాడు.  వివిధ జిల్లాలకు పాలిష్‌ పౌడర్‌ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రవాణా చేస్తున్నాడు.  

ఇతడి వద్ద వీటిని ఖరీదు చేస్తున్న వారిలో కరీంనగర్‌కు చెందిన సతీష్‌, విష్ణువర్థన్‌రెడ్డి సైతం ఉన్నారు. గురువారం ఉదయం వీరిద్దరినీ పట్టుకున్న అక్కడి పోలీసులు వారి నుంచి భారీ మొత్తంలో డిటొనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నేపథ్యంలో తమకు వీటిని హైదరాబాద్‌ నుంచి షబ్బీర్‌ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. రంగంలోకి దిగిన దక్షిణ మండల టాస్‌్కఫోర్స్‌ పోలీసులు ఫాతీమానగర్‌లోని స్థావరంపై దాడి చేసి షబ్బీర్‌తో పాటు హమీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి దాదాపు టన్ను గన్‌పౌడర్‌ స్వాధీనం చేసుకున్నారు
 

మరిన్ని వార్తలు