పోలీసులను చుక్కలు చూపిస్తున్న మోస్ట్‌ వాంటెడ్‌ దొంగ.. ఆఖరికి ఓ చిన్న తప్పుతో..

27 Mar, 2022 07:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎంత పెద్ద నేరస్తుడైనా ఎక్కడో ఒకచోట చిన్న పొరపాటైనా చేస్తాడు లేదా క్లూ అయినా వదులుతాడని’ పోలీసులు చెబుతుంటారు. ఆఖరికి ఇదే నిజమైంది. ఏడేళ్లుగా మూడు కమిషనరేట్ల పోలీసులను ముప్పుతిప్పులు పెడుతున్న మోస్ట్‌ వాంటెడ్‌ దొంగ.. ఆఖరికి ఓ చిన్న పొరపాటుతో పోలీసులకు దొరికిపోయాడు. జిల్లెల్లగూడలోని ఓ ఇంట్లో బంగారం, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను చోరీ చేసిన గజదొంగ సయ్యద్‌ సాహిల్‌... ఆ ఫోన్‌ను తన బావమరిదికి బహుమతిగా ఇచ్చాడు. అది చోరీ ఫోన్‌ అని తెలియక అతను దాన్ని వినియోగించడం మొదలు పెట్టాడు.

అప్పటికే ఫోన్‌ చోరీ జరిగిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. దాని ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నంబర్‌ను పోలీసులు ట్రాకింగ్‌లో పెట్టారు. సాంకేతిక సాక్ష్యాలను సేకరించిన మీర్‌పేట పోలీసులు.. శనివారం బాలాపూర్‌ క్రాస్‌ రోడ్డులో రెక్కీ చేస్తున్న సాహిల్‌ను మాటువేసి పట్టుకున్నారు. వనస్థలిపురం మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ ఎం మహేందర్‌ రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డిలతో కలిసి ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ వివరాలు వెల్లడించారు. 

ఆరేళ్లుగా అన్నదమ్ముల ఆటలు..  
చాంద్రాయణగుట్ట షాహీన్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ మొహమ్మద్, సయ్యద్‌ సాహిల్‌లు అన్నదమ్ములు. ఆరేళ్లుగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీసులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. 2015లో గోల్కొండ పీఎస్‌ పరిధిలో వీరిపై తొలి కేసు నమోదయింది. అప్పట్నుంచి ఇప్పటివరకు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 33, సైబరాబాద్‌లో 8, రాచకొండ కమిషనరేట్‌లో 9 వీరిపై మొత్తం 50 కేసులున్నాయి.

గతంలో వీరిని మీర్‌పేట, గోల్కొండ, లంగర్‌హౌస్, బంజారాహిల్స్, ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, నార్సింగి, రాయదుర్గం, రాజేంద్రనగర్, కొత్తూరు పీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. గతేడాది డిసెంబర్‌లో జైలు నుంచి విడుదలైన సయ్యద్‌ సాహిల్‌.. మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టాడు. గడిచిన మూడు నెలల్లో సాహిల్‌ బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో, మీర్‌పేటలో ఏడు చోరీలకు పాల్పడ్డాడు.  
చదవండి: జ్వరం గోలీకి ధరల సెగ!

రాత్రి 7 నుంచి 11 గంటల మధ్యే చోరీలు.. 
చోరీ చేయడంలో సాహిల్‌ స్టైలే వేరు. ఉదయం పూట బైక్‌ మీద రెక్కీ నిర్వహించి, రాత్రి 7 నుంచి 11 గంటల మధ్య మాత్రమే దొంగతనాలు చేస్తుంటాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకొని, రాత్రి వేళలో వెంట తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్, ఇనుప రాడ్‌తో ఇంటి ప్రధాన ద్వారాన్ని తెరుస్తాడు. ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు, నగదు ఎలక్ట్రానిక్‌ వస్తువులతో పరారవుతాడు. చోరీ చేసిన సొత్తులో కొంత భాగం ఇంట్లో దాచిపెట్టుకోగా.. మిగిలిన దాన్ని బంగారం దుకాణాలు, పాన్‌ బ్రోకర్లు, మణప్పురం ఫైనాన్స్‌ వంటి వాటిల్లో తాకట్టు పెడతాడు. 

ఇలా చిక్కిపోయాడు.. 
బాలాపూర్‌ క్రాస్‌రోడ్స్‌లో శనివారం ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న మీర్‌పేట సీఐ మహేందర్‌ రెడ్డి, డీఐ  శేఖర్‌ రంగంలోకి దిగారు. సాహిల్‌ను అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. మొహమ్మద్‌ పరారీలో ఉన్నాడు. నిందితుడి నుంచి 81.2 తులాల బంగారం, 2.45 తులాల వెండి ఆభరణాలతో పాటు ల్యాప్‌టాప్, బైక్, స్క్రూ డ్రైవర్, ఇనుప రాడ్‌లను స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు