కటకటాల్లో గజదొంగ నాయక్‌ 

5 Mar, 2022 05:07 IST|Sakshi
సొత్తును చూపిస్తున్న డీసీపీ రాజేష్‌చంద్ర   

గతేడాది నారాయణగూడ పీఎస్‌ పరిధిలో భారీ చోరీ 

బంగారం, వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీ స్వాధీనం 

సెంట్రల్‌ జోన్‌ డీసీపీ రాజేష్‌చంద్రన్‌

హిమాయత్‌నగర్‌: భారీ చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్‌ విసురుతున్న మోస్ట్‌ వాంటెడ్‌ గజదొంగ సంతోష్‌నాయక్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 22.409 తులాల బంగారు ఆభరణాలు, 23.7 తులాల వెండి ఆభరణాలు, 11 విదేశీ కరెన్సీలు, 251 విదేశీ కరెన్సీ కాయిన్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్‌జోన్‌ డీసీపీ రాజేష్‌ చంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ రమణరెడ్డి, అబిడ్స్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.జానయ్య, నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు, డీఐ రవికుమార్‌లతో కలసి వివరాలను వెల్లడించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా దొంగలింగాల గ్రామానికి చెందిన జతావత్‌ సంతోష్‌నాయక్‌ 15 ఏళ్ల ప్రాయంలోనే చోరీల బాట పట్టాడు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు ఇతడిపై 29 కేసులు నమోదయ్యాయి. పలుమార్లు జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదన్నారు. జువైనల్‌ హోం నుంచి వచ్చాక కూడా చోరీలు చేశాడని పేర్కొన్నారు.

గత ఏడాది అక్టోబర్‌లో నారాయణగూడ పీఎస్‌ పరిధిలోని ఆయిల్‌సీడ్‌ కాలనీలో వైద్యుని ఇంట్లో ఇతని స్నేహితుడు విక్రమ్‌తో కలసి భారీ చోరీ చేశాడు. ఈ చోరీలో 50 తులాల బంగారు ఆభరణాలు, 3 వేల విదేశీ కరెన్సీ, కెమెరా, విలువైన వస్త్రాలు దొంగలించాడు. చోరీ అనంతరం నగరంలో రెండు రోజులున్న నాయక్‌ తిరుపతికి చేరాడు. విషయం పోలీసులకు తెలిసిందని గమనించిన నాయక్‌ వైజాగ్‌కు మకాం మార్చాడు. ఎట్టకేలకు ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నాయక్‌ను అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు