ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీ చేస్తున్న మఠా 

5 Mar, 2022 04:29 IST|Sakshi
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న సీపీ మహేష్‌ భగవత్‌ 

ఒకరి అరెస్టు 

పరారీలో మరో ముగ్గురు నిందితులు  

రూ.23 లక్షల 80 వేల విలువైన నగదు, నగలు స్వాధీనం 

మౌలాలి: రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ జిల్లా ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు  స్వాదీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

జగిత్యాలకు  చెందిన షేక్‌ యామిన్‌ అలియాస్‌ సలీం (39), మహరాష్ట్రకు చెందిన ఉస్మాన్, నిజామాబాద్‌కు చెందిన లక్ష్మణ్, మరో వ్యక్తి మొత్తం నలుగురు కలిసి రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని 16, సైబరాబాద్‌ పరిధిలో 01, జోగుళాంబ గద్వాల్‌లో 09, మహబూబ్‌నగర్‌లో 01, కామారెడ్డి, 01, మెదక్‌లో 04, నల్గొండలో 03, నిజామాబాద్‌లో 05 చొప్పున మొత్తం 41 చోట్ల రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడేవారు. ఇటీవల ప్రధాన నిందితుడు షేక్‌ యామిని అలియాస్‌ సలీంను ఎల్బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు అదుపులోని తీసుకున్నారు.

అతని వద్ద నుంచి రూ. 18 లక్షల 20 వేల విలువ గల  350 గ్రాముల బంగారు అభరణాలు, లక్షా రూపాయల విలువగల కిలోన్నర వెండి,  లక్షా 50 వేల నగదు, రెండు  ద్విచక్ర వాహనాలు, రెండు మొబైల్‌ ఫోన్లు, ఒక టీవీ, ఒక ల్యాప్‌టాప్‌తోపాటు  మొత్తం  రూ. 23 లక్షల 80 వేల  విలుగల నగదు, నగలు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొని ప్రధాన నిందితుడు షేక్‌ యామిన్‌ అలియాస్‌ సలీంను రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. వారిని త్వరలో పట్టుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు