వయసు 26.. కేసులు 20 

23 Mar, 2021 10:58 IST|Sakshi

తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌ 

నిజాం మ్యూజియం కేసులో నిందితుడు 

50 తులాల బంగారం స్వాధీనం  

శంషాబాద్‌: అతడి పేరు మహ్మద్‌ గౌస్‌ అలియాస్‌ గౌస్‌ పాషా.. వయసు 20 సంవత్సరాలు.. పదహారేళ్ల వయసు నుంచి ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలు చేస్తున్న అతడిపై సైబరాబాద్, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో ఇరవై కేసులు నమోదయ్యాయి. గతేడాది ఆగస్టులో జైలు నుంచి విడుదలైన గౌస్‌ తిరిగి చోరీలు చేస్తుండడంతో రాజేంద్రనగర్‌ పోలీసులతో కలిసి శంషాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్‌ చేసి కటకటాల్లోకి నెట్టారు. వివరాలను శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి సోమవారం  విలేకరుల సమావేశంలో వివరించారు.

రాజేంద్రనగర్‌ చింతలమెట్‌కు చెందిన గౌస్‌ పాషా ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్రవాహనంపై తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తాడు. అదే రోజు, మరసటిరోజు ఆ ఇంటి కిటికీలను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదు, బంగారం దొంగిలిస్తుంటాడు. అంతేకాకుండా రాత్రి సమయాల్లో ఒంటిరిగా వెళ్తున్న వారిని బెదిరించి డబ్బులు, నగలు లాక్కోవడం వంటి నేరాలు కూడా చేశాడు. ఇటీవల రాజేంద్రనగర్‌ సర్కిల్‌ సులేమాన్‌నగర్‌లో కత్తులతో వీధుల్లో తిరిగి స్థానికులను భయబ్రాంతులకు గురిచేశాడు.  

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ పర్యవేక్షణలో శంషాబాద్‌ ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్‌ పోలీసులు అతడిని ఆదివారం రాజేంద్రనగర్‌లో అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి 50 తులాల బంగారంతో పాటు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గౌస్‌పై పీడీయాక్టు, రౌడీషీట్‌ నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేసును ఛేదించిన పోలీసులకు రివార్డు అందజేశారు.  2018లో నిజాం మ్యూజియంలో జరిగిన బంగారు టిఫిన్‌ బాక్స్, స్పూన్, బంగారంతో చేసిన ఖురాన్‌లు దొంగతనం కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. 

చదవండి: మొన్న లక్ష, నిన్న రూ.70 వేలు ఇంటి ముందు పడేశారు!

మరిన్ని వార్తలు