వయసు 21.. కేసులు 20.. జల్సాల కోసం వాహనాల చోరీ

19 Jul, 2022 07:25 IST|Sakshi

సరదాగా తిరిగేందుకు వాహనాల చోరీ

ఒకటి తస్కరించాక కొన్నాళ్ల పాటు చక్కర్లు

ఆపై దాన్ని వదిలేసి మరోటి దొంగతనంటాస్క్‌ఫోర్స్‌ టీమ్‌

సాక్షి, హైదరాబాద్‌: పెట్రోల్‌ బంక్‌లో పని చేసే అతగాడికి ద్విచక్ర వాహనాలంటే సరదా. వాటిపై తిరగాలనే కోరికకు తన ఆర్థిక స్థోమత అడ్డు వస్తోంది. దీంతో వాహనాలను చోరీ చేసి చక్కర్లు కొట్టడం మొదలెట్టాడు. చోరీ వాహనాలను విక్రయించినా, ఒకే దానిపై ఎక్కువ రోజులు తిరిగినా పోలీసులకు చిక్కుతుండటంతో తస్కరించిన దానిపై కొన్నాళ్లు చక్కర్లు కొట్టి వదిలేయడం మొదలెట్టాడు. ఈ పంథాలో ఇప్పటి వరకు 20 నేరాలు చేసిన 21 ఏళ్ల ఎం.వెంకటేశ్‌ను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం పట్టుకున్నట్లు డీసీపీ డి.సునీత రెడ్డి వెల్లడించారు.

ఆసిఫ్‌నగర్‌ పరిధిలోని జిర్రా ప్రాంతానికి చెందిన వెంకటేష్‌ పాఠశాల స్థాయిలోనే చదువుకు స్వస్థి చెప్పాడు. ఆపై చిన్న చిన్న పనులు చేసినప్పటికీ ప్రస్తుతం ఓ పెట్రోల్‌ బంక్‌లో పని చేస్తున్నాడు. వివిధ రకాలైన ద్విచక్ర వాహనాలపై తిరగాల న్నది ఇతడి కోరిక. అయితే వాటిని ఖరీదు చేయడానికి తన ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో 2016 నుంచి చోరీలు చేయడం మొదలెట్టాడు. తొలినాళ్లల్లో చోరీ చేసిన వాహనాలపై తిరిగి వదిలేసేవాడు. ఆపై వాటికి ఉన్న డిమాండ్‌ గుర్తించిన ఇతగాడు జిర్రా ప్రాంతంలో అనేక మందికి మాయమాటలు చెప్పి తక్కువ రేటుకు అమ్మాడు. ఆ సందర్భంలో ఇతడిని అరెస్టు చేసిన పోలీసులు ఆయా వాహనాలను రికవరీ చేశారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో బెయిల్‌పై వచ్చిన ఇతడిని ఆ వాహనాలు ఖరీదు చేసిన వారు నిలదీయడంతో పాటు దాడులకు పాల్పడ్డారు. ఇకపై చోరీ చేసిన వాహనాన్ని ఎవరికీ విక్రయించకూడదని నిర్ణయించుకున్న వెంకటేష్‌ తన పంథా కొనసాగించాడు.

15 రోజుల తర్వాత.. 
మే నెల నుంచి ఇప్పటి వరకు ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, టప్పాచబుత్ర, మంగళ్‌హాట్, బోయిన్‌పల్లి పోలీసుస్టేషన్ల పరిధి నుంచి ఎనిమిది వాహనాలు తస్కరించాడు. ఒకదాన్ని చోరీ చేసిన తర్వాత పది పదిహేను రోజులు దానిపై చక్కర్లు కొడతాడు. ఆపై నిర్మానుష్య ప్రాంతంలో ఆ వాహనాన్ని పడేసి మరోటి చోరీ చేస్తాడు. ఇతడి వ్యవహారాలపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్‌.శ్రీశైలం, కె.నర్సింహులు, షేక్‌ బురాన్‌లతో కూడిన బృందం వలపన్ని అదుపులోకి తీసుకుంది. ఇతడి నుంచి రూ.5 లక్షల విలువైన 8 వాహనాలు స్వాదీనం చేసుకుని ఆసిఫ్‌నగర్‌ పోలీసులకు అప్పగించింది. వీటితో సహా ఇప్పటి వరకు ఇతడిపై మొత్తం 20 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: పల్సర్‌ బైక్‌లే టార్గెట్‌.. ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు ఏర్పడిన పరిచయం..

మరిన్ని వార్తలు