‘క్లబ్‌ మస్తీ’పై ఎస్‌ఓటీ పోలీసుల ఆకస్మిక దాడి

5 Jun, 2022 14:28 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలోని మంజీరా మెజిస్టిక్‌లో నిర్వహిస్తున్న క్లబ్‌ మస్తీ రెస్టో బార్‌ అండ్‌ పబ్‌పై మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న తొమ్మిది మంది యువతులతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిర్వహణ అనుమతుల ను తీసుకున్న క్లబ్‌ మస్తీ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా తెల్లవారుజాము వరకు పబ్‌ను నిర్వహిస్తూ యువతీ యువకులను ఆకర్షిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మికంగా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌పై దాడి చేశారు.

అప్పటికే హోరెత్తించే డీజే శబ్దాల నడుము యువత మద్యం సేవించి నృత్యాలు చేస్తూ కనిపించా రు. మప్టీలో ఉన్న పోలీసులు వారి ఫొటోలు, వీడియోలను తీయడంతో అనుమానం వచ్చిన పలువురు యువకులు పరుగులు తీశారు. దీంతో అందరినీ ఒకచోటకు చేర్చి వారి వివరాలను సేకరించారు. అనంతరం పబ్‌లో సేవిస్తున్న మద్యం వివరాలు, హుక్కా వివరాలు సేకరించి డ్రగ్స్‌ వంటి మాదకద్రవ్యాలు సేవించారా? అనే విషయమై ఆరా తీశారు. డ్రగ్స్‌ విషయంలో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో హుక్కా సేవించే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా పబ్‌ మస్తీ యాజమానులైన శివప్రసాద్‌రెడ్డి, మేనేజర్‌ విష్ణు, నిర్వాహకుడు కృష్ణ పరారీలో ఉండగా, డ్యాన్స్‌లు చేస్తూ పట్టుబడిన తొమ్మిది మంది యువతులతో పాటు మేనేజర్‌ ప్రదీప్‌కుమార్, డ్యాన్సర్‌ ప్రవీణ్, డీజే ఆపరేటర్‌ ధన్‌రాజ్, సాయిసంతోష్‌లను అదుపులోకి తీసుకున్నారు. ప

బ్‌లోని డీజే మిక్సర్, కంట్రోలర్, క్రాస్‌ ఓవర్‌ పరికరాలను సీజ్‌ చేశారు. అనంతరం వీరిని కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు. కేపీహెచ్‌బీ సీఐ కిషన్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా గతంలోనూ ఇక్కడి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌పై పలువురు ఫిర్యాదు చేయగా కొద్ది రోజుల పాటు పబ్‌ కార్యకలాపాలను నిలిపివేసిన యజమానులు తిరిగి ఇటీవల కాలంలో మళ్లీ మొదలుపెట్టినట్లు తెలిసింది. ప్రధానంగా యువతులను ఎరవేసి యువకులను పబ్‌కు రప్పిస్తున్నారన్న ఆరోపణలు పబ్‌ నిర్వాహకులపై ఉన్నాయి. 

మరిన్ని వార్తలు