రూ. 100 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత!

18 Aug, 2020 02:13 IST|Sakshi

హైదరాబాద్‌లో మరో మాదకద్రవ్యాల రాకెట్‌ గుట్టు రట్టు

నగరం నుంచి సరుకుతో బయల్దేరిన ప్రైవేటు ప్యాసింజర్‌ బస్సు

ఆగస్టు 15న ముంబైలో వెంటాడి పట్టుకున్న డీఆర్‌ఐ

501 కిలోల డ్రగ్స్, విదేశీ కరెన్సీ స్వాధీనంముగ్గురి అరెస్టు..

2017లో పట్టుబడ్డ నిందితుడే మాస్టర్‌మైండ్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మరో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ బయటపడింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు రూ.100 కోట్ల విలువైన 501 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారు. పంద్రాగస్టు రోజు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మునిగి ఉంటుందని, ఎలాంటి నిఘా ఉండదనుకొని భారీగా డ్రగ్స్‌ సరఫరాకు పూనుకున్న డ్రగ్‌ మాఫియా ఎత్తులు ఊహించని విధంగా చిత్తయ్యాయి. ఈ నెల 15న హైదరాబాద్‌ నుంచి ముంబైకి  భారీగా డ్రగ్స్‌ సరఫరా కానుందని డీఆర్‌ఐ అధికారులకు ఉప్పందింది. అప్రమత్తమైన డీఆర్‌ఐ అధికారులు హైదరాబాద్‌ శివారులోని ఓ ఫ్యాక్టరీ, ముంబైలోని లేబొరేటరీపై నిఘా పెట్టారు. హైదరాబాద్, ముంబై నగరాల్లోని పలు ప్రాంతాల్లో మూడురోజులపాటు అత్యంత రహస్యంగా, పకడ్బందీగా ఆపరేషన్‌ నిర్వహించారు. (ఇంకా వరద బురదలోనే..)

హైదరాబాద్‌ నుంచి ముంబైకి భారీగా మెఫిడ్రోన్స్‌ డ్రగ్స్‌ లోడుతో వెళ్తున్న ప్రయాణికులు లేని ప్రైవేటు ప్యాసింజర్‌ బస్సును డీఆర్‌ఐ అధికారులు వెంటాడి పంద్రాగస్టు ఉదయం ముంబైలో పట్టుకున్నారు. అక్కడి లేబొరేటరీ నుంచి భారీగా మెఫిడ్రోన్, కెటమైన్, ఎఫిడ్రిన్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో 2017లో డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన వ్యక్తే ఈ రాకెట్‌ సూత్రధారి అని డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌ నుంచి తీసుకువచ్చిన డ్రగ్స్‌ను ముంబైలోని లేబొరేటరీలో ప్యాక్‌ చేసి దేశం నలుమూలలా సరఫరా చేసేవారు. (కరోనా నేపథ్యం... కార్డులు తెగ వాడేస్తున్నారు)

ఏమేం దొరికాయంటే..?
నగర శివారులోని ఫ్యాక్టరీని, ముంబైలోని లేబొరేటరీని అధికారులు సీజ్‌ చేసి 210 కిలోల మెఫిడ్రోన్, 31 కిలోల ఎఫిడ్రిన్, 10 కిలోల కెటమైన్‌ను స్వాధీనం చేసకున్నారు. ఈ మూడింటి విలువ రూ.47 కోట్లు. ఇక 250 కిలోల మెఫిడ్రోన్‌ ముడిసరుకు విలువ రూ.50 కోట్లు. వీటికితోడు రూ.45 లక్షల నగదు, అమెరికా, యూరో కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి రూ.100 కోట్లకుపైగా విలువైన 501 కిలోల డ్రగ్స్‌ను, విదేశీ మారకాన్ని డీఆర్‌ఐ స్వాధీనం చేసుకుంది. మాదకద్రవ్యాల కార్యకలాపాల నియంత్రణ చట్టం 1985 ప్రకారం.. కేసు నమోదు చేసిన డీఆర్‌ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు