అర్ధరాత్రి 70 మంది రౌడీలు న్యాయవాది ఇంట్లోకి చొరబడి..

26 Feb, 2023 08:15 IST|Sakshi
ప్రతికాత్మక చిత్రం

సాక్షి,బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 5లోని ఉమెన్‌ కో–ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలో నివసిస్తున్న సుప్రీం కోర్టు న్యాయవాది విశ్వనాథరెడ్డి ఇంట్లోకి శుక్రవారం అర్ధరాత్రి 70 మంది భూకబ్జాదారులు, రౌడీలు చొరబడి కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేసి ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉమెన్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ ప్లాట్‌ నం.85, 86లో వెయ్యి గజాల స్థలం 1990 నుంచి సుప్రీం కోర్టు న్యాయవాది విశ్వనాథరెడ్డి, ఆయన భార్య సురేఖారెడ్డి ముదిగంటి ఆధీనంలో ఉంది.

ఇందులో ఇల్లు  కట్టుకొని కొడుకు భరత సింహారెడ్డితో కలిసి ఉంటున్నారు. ప్రభుత్వానికి క్రమబద్దీకరణ కోసం కూడా దరఖాస్తు చేసుకొని ఫీజు చెల్లించారు.  అయితే పరమేశ్వర్‌రామ్‌ అనే విశ్రాంత గ్రూప్‌–1 అధికారి ఈ స్థలం తనదేనంటూ వాదిస్తూ అదే ప్రాంతంలో ఉండే ప్లాట్‌ నంబర్‌ 91కి చెందిన పత్రాలతో విశ్వనాథ్‌రెడ్డి ప్లాట్‌ను మరొకరికి డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌కు రూ.15 లక్షలు తీసుకొని ఇచ్చాడు. దీంతో సదరు వ్యక్తి అర్ధరాత్రి 70 మంది గూండాలను తీసుకొని కర్రలు, రాడ్లతో బీభత్సం సృష్టించి కారంపొడి పొట్లాలు చల్లుతూ వీరంగం సృష్టించాడు. దీంతో తీవ్ర భయబ్రాంతులకు గురైన వాచ్‌మెన్‌తో పాటు విశ్వనాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులు అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో డయల్‌ 100కు కాల్‌ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి రౌడీల్లో కొందరు పారిపోగా,  మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారించారు. శనివారం బంజారాహిల్స్‌ ఏసీపీ శ్రీధర్, సీఐ రాజశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితులపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి   'అమ్మానాన్న క్షమించండి.. నేను వెళ్లిపోతున్నా..'

మరిన్ని వార్తలు