చంపేస్తానంటూ హెచ్చరించాడు.. చివరికి ప్రత్యర్థుల చేతిలో హతమయ్యాడు

20 Jul, 2021 07:40 IST|Sakshi

పాతకక్షలతోనే రౌడీషీటర్‌ ముస్తఖుద్దీన్‌ హత్య  

నిందితుల్ని అరెస్ట్‌ చేసిన చాదర్‌ఘాట్‌ పోలీసులు  

వివరాలు వెల్లడించిన నగర సీపీ అంజనీకుమార్‌  

సాక్షి, హిమాయత్‌నగర్‌( హైదరాబాద్‌): చంపేస్తానంటూ పలుమార్లు హెచ్చరించిన రౌడీషీటరే.. ప్రత్యర్థుల చేతిలో హతమయ్యాడని, ఈ నెల 17న మలక్‌పేట వహీద్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్‌ సయ్యద్‌ ముస్తఖుద్దీన్‌ (35)ను హత్య చేసిన అయిదుగురు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ చెప్పారు. ఈస్ట్‌జోన్‌ జాయింట్‌ కమిషనర్‌ రమేష్‌రెడ్డి, అడిషనల్‌ డీసీపీ మురళీధర్, టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ జి.చక్రవర్తిలతో కలిసి సోమవారం ఆయన కార్యాలయంలో వెల్లడించా రు.

చంపుతానంటే.. చంపేశారు
సీపీ చెప్పిన వివరాల ప్రకారం.. సయ్యద్‌ ముస్తఖుద్దీన్‌కు ఓల్డ్‌ మలక్‌పేటకు చెందిన రౌడీషీటర్లు, డెయిరీఫాం వ్యాపారి మహమూద్‌ బిన్‌ అల్వీ అలియాస్‌ మహమూద్‌ జబ్రీ, బైన్‌స్వాల మహమూద్, ఇతని తమ్ముడు ఆయూబ్‌ బిన్‌ అల్వీల మధ్య పాత కక్షలు ఉన్నాయి. మహమూద్‌ బిన్‌ అల్వీని చంపేస్తానంటూ సయ్యద్‌ ముస్తఖుద్దీన్‌ గతంలో పలుమార్లు బెదిరింపులకు దిగాడు. దీంతో మహమూ ద్‌ బిన్‌ అల్వీ తన తమ్ముడు ఆయుబ్‌ బిన్‌అల్వీకి విషయం చెప్పాడు. పూల్‌బాగ్‌ చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మ ద్‌ హైదర్‌ అలీ ఖద్రీ, ఓల్డ్‌ మలక్‌పేటకు చెందిన మహ్మద్‌ జుబేర్, రామంతాపూర్‌నకు చెందిన వలీ అహ్మద్‌ల సాయం తీసుకున్నారు.

ఈ నెల 17న అర్ధరాత్రి ఓల్డ్‌ మలక్‌పేటలోని అబూ బకర్‌ మసీదు వద్దకు వచ్చిన సయ్యద్‌ ముస్తఖుద్దీన్‌పై కత్తులతో దాడి చేశారు. ముస్తఖుద్దీన్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న చాదర్‌ఘాట్‌ పోలీసులు విచారణ చేపట్టారు. అఫ్జల్‌గంజ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో నిందితులను అరెస్టు చేశారు. వీరు సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌లకు సైతం పాల్పడినట్లు సీపీ అంజనీకుమార్‌ పేర్కొన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు 
నగరంలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడి.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ హెచ్చరించారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జనవరి 1 నుంచి ఈ నెల 15 వరకు మొత్తం 21 మంది రౌడీషీటర్లను అరెస్ట్‌ చేశామన్నారు. మరో 31మందిపై పీడీ యాక్ట్‌ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

ఎవరైనా రౌడీయిజం చెలాయించాలని చూస్తే ప్రజలు 94906 16555కు వాట్సప్‌లో ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు. జంట నగరాల్లో ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా 272 మంది చిన్నారులను రెస్క్యూ చేశామన్నారు. బోనాలు, బక్రీద్‌ వేడుకలను ప్రశాంత  వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఇటీవల సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న 30 మందికి తిరిగి వాటిని అందజేశామని చెప్పారు. ఎస్సార్‌నగర్, కార్ఖానా, ఆసీఫ్‌నగర్‌ పోలీసు స్టేషన్లను 15 రోజుల్లో ప్రారంభించనున్నట్లు సీపీ తెలిపారు.    

మరిన్ని వార్తలు