శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

24 Feb, 2023 05:20 IST|Sakshi

అక్రమంగా తరలిస్తున్న 23 మంది సుడాన్‌ మహిళలు 

శంషాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీఎత్తున బంగారం పట్టుబడింది. సుడాన్‌ జాతీయులైన 23 మంది మహిళలు సుడాన్‌ నుంచి వయా షార్జా మీదుగా జి9–458 విమానంలో గురువారం తెల్లవారుజామున శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. లగేజీల స్కానింగ్‌లో బంగారం బయటపడడంతో అధికారులు అప్రమత్తమై మరింత క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బూట్ల అడుగున ప్రత్యేకంగా తయారు చేసిన భాగంలో పెద్దఎత్తున ఆభరణాలు సైతం బయటపడ్డాయి. మొత్తం 14 కేజీల 906 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.7.89 కోట్లుగా అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నలుగురు మహిళలను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.  

స్మగ్లర్లకు అందించేందుకే.. 
సుడాన్‌కు చెందిన మహిళలందరూ క్యారియర్లుగానే బంగారం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. స్మగ్లర్లకు అక్రమంగా బంగారం చేరవేసేందుకే వీరు షార్జా మీదుగా హైదరాబాద్‌ చేరుకున్నట్లు సమాచారం. గతంలో కూడా సుడాన్‌కు చెందిన పలువురు మహిళలు అక్రమంగా బంగారం, విదేశీ నగదుతో పట్టుబడిన కేసులున్నాయి. వీరి సెల్‌ఫోన్‌ల ఆధారంగా బంగారం స్మగ్లర్ల వివరాలను తెలుసుకునేందుకు కస్టమ్స్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.   


మరిన్ని వార్తలు