రూ.7444 ఇంజెక్షన్‌ @రూ.35 వేలు!

22 Jun, 2021 10:43 IST|Sakshi

నల్ల బజారులో బ్లాక్‌ ఫంగస్‌ ఇంజెక్షన్లు

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

35 ఇంజెక్షన్లు స్వాదీనం

సాక్షి, హైదరాబాద్‌: బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు వినియోగించే  ఔషధాలను అనధికారికంగా సేకరించి, నల్లబజారుకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు మెడికల్‌ షాపు నిర్వాహకులు ఉన్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. టాస్‌్కఫోర్స్‌ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  వివరాలు వెల్లడించారు. కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన కె.క్రాంతి కుమార్‌ వీవీ నగర్‌లో మెడిక్స్‌ ఫార్మసీ పేరుతో, వివేకానంద నగర్‌కు చెందిన ఎన్‌.వెంకట దినేష్‌ స్థానికంగా శంకరి పార్మసీ పేరుతో మందుల దుకాణాలు నిర్వహిస్తున్నారు.

ఆల్విన్‌ కాలనీకి చెందిన బాలాజీ మెడిసిన్‌ వరల్డ్‌ యజమాని శ్రీనివాస్‌తో కలిసి వారు బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు వాడే ఎంపోటెరిసరిన్‌–బి సంబంధిత ఇంజెక్షన్లను సేకరించారు. కొందరు రోగుల వద్ద మిగిలిన వాటిని దళారుల ద్వారా ఖరీదు చేయడంతో పాటు నకిలీ పత్రాలతో రోగుల బంధువుల మాదిరిగా సమీకరించిన వారి నుంచి వీరు కొనుగోలు చేసేవారు. అనంతరం రూ.7444 ఖరీదైన ఫంగ్లిప్‌ ఇంజెక్షన్‌ను రూ.35 వేలకు, రూ.8500 ఎంఆర్పీ కలిగిన పోసాకొంజోలీ ఇంజెక్షన్‌ను రూ.50 వేల చొప్పున విక్రయించేందుకు పథకం వేశారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి కుటుంబీకులు, బంధువుల్ని టార్గెట్‌గా చేసుకుని ఈ దందాకు దిగారు.

దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల జావేద్‌ నేతృత్వంలో ఎస్సైలు టి.శ్రీధర్, కె.శ్రీనివాసులు, మహ్మద్‌ షానవాజ్‌ షపీ వలపన్నారు. సోమవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వీరి నుంచి 35 ఇంజెక్షన్లు స్వా«దీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం రామ్‌గోపాల్‌పేట్‌ పోలీసులకు అప్పగించారు. టాస్‌్కఫోర్స్‌ పోలీసులు కోవిడ్, బ్లాక్‌ ఫంగస్‌ మందుల అక్రమ దందాపై నిఘా పెంచారని సీపీ తెలిపారు. సెకండ్‌ వేవ్‌ మొదలైనప్పటి నుంచి 56 కేసులు నమోదు చేసి 136 మందిని అరెస్టు చేశామని, వీరి నుంచి 450 ఇంజెక్షన్లు స్వా«దీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.   

మరిన్ని వార్తలు