తల్లీ కూతుళ్ల ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్టు 

20 Aug, 2022 17:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బోరబండ విజేత థియేటర్‌ ఎదురుగా సాగర్‌సొసైటీ గుడిసెల్లో జరిగిన తులసీబాయి, శిరీష ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. పక్కింట్లో ఉండే వ్యక్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు. బోరబండ హైటెక్‌ సిటీ హోటల్‌ సమీపంలోని నివసించే మృతురాలి కూతురు జ్యోతి, కుమారు పరుశరాంలు విలేకర్లతో మాట్లాడుతూ.. 2019 తమ తండ్రిని గోపాల్‌ను కూడా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని అన్నారు.

అప్పట్లో పక్కింట్లో ఉండే వ్యక్తిపై ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారన్నారు. అయితే బయటికి వచ్చాక ఇంటికి వచ్చేవాడని, జైలుకు వెళ్లినందుకు తనకు డబ్బులు ఖర్చు అయ్యాయని, డబ్బుల కోసం తమ తల్లిని వేధిస్తూ వచ్చాడని ఆరోపించారు. అదే కోపంతో తల్లితో పాటు చెల్లి శిరీషను హత్య చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఇంటి బయట ఉన్న చెప్పులను కూడా స్వాధీనం చేసుకున్నారని తెలపారు.

లోతుగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఇన్‌స్పెక్టర్‌ సైదులును వివరణ కోరగా పోస్టుమార్టం రిపోర్టు వస్తే తల్లీ కూతుళ్ల మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. బయట లభించిన చెప్పులతో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 
చదవండి: Hyderabad: అమ్మాయిలా నటిస్తూ.. రొమాంటిక్‌గా వారితో చాటింగ్‌

మరిన్ని వార్తలు