అతడంటే ఆది నుంచీ వ్యతిరేకతే! 

6 May, 2022 02:39 IST|Sakshi
మొబిన్‌ అహ్మద్‌, మసూద్‌ అహ్మద్‌ 

సోదరి ప్రేమ, పెళ్లితో ముదిరిన వైరం 

నెల రోజులపాటు రెక్కీ

సరూర్‌నగర్‌ హత్య కేసులో ఇద్దరు అరెస్టు

సాక్షి, హైదరాబాద్‌: సరూర్‌నగర్‌ హత్య కేసు నిందితులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. హతుడు బి.నాగరాజు అంటే నిందితుడు సయ్యద్‌ మొబిన్‌ అహ్మద్‌కు ఆది నుంచీ వ్యతిరేకతే ఉందని, తన సోదరిని ప్రేమించడంతో మొదలైన వైరం వివాహం చేసుకోవడంతో అంతం చేసే వరకు వెళ్లిందని ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ వెల్లడించారు. ఏసీపీ పి.శ్రీధర్‌రెడ్డితో కలసి గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఒకే స్కూల్, కాలేజీలో చదువుకున్న నాగరాజు, అశ్రిన్‌ మధ్య ఐదేళ్ల క్రితం ప్రేమ చిగురించింది. దీంతో నాగరాజు, మొబిన్‌ మధ్య వైరం మొదలైంది. ఈ క్రమంలో జనవరి 30న ఇంట్లోంచి వెళ్లిన అశ్రిన్‌ మరు సటి రోజు ఆర్యసమాజ్‌లో నాగరాజును వివాహం చేసుకుంది. ఫిబ్రవరి 1న ఆమెకు టుంబీకులు బాలానగర్‌ ఠాణాలో మిస్సింగ్‌ కేసు పెట్టారు. నాగరాజు, అశ్రిన్‌లు మేజర్లు కావడంతో పోలీసులు అశ్రిన్‌ కుటుంబీకులకు కౌన్సిలింగ్‌ చేసి పంపారు.

ప్రస్తుతం భార్యాభర్తలు సరూర్‌నగర్‌లోని బృందావన్‌ కాలనీలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో మొబిన్‌.. నాగరాజు పట్ల మరింత కక్ష పెం చుకున్నాడు. నెల క్రితం నుంచి ఆచూకీ కోసం వెతుకుతూ మలక్‌పేటలోని ఓ కార్ల షోరూమ్‌లో నాగరాజు పని చేస్తున్నట్లు గుర్తించాడు. నాగరాజును అంతం చేయా లని నిర్ణయించుకున్న మొబిన్‌ బుధవారం తన బావ (మరో సోదరి భర్త) మ హ్మద్‌ మసూద్‌ అహ్మద్‌తో కలసి షోరూమ్‌ వద్దకు వెళ్లినా అక్కడ దాడి సాధ్యం కాలేదు.

నాగ రాజు విధులు ముగించుకుని వెళ్తూ.. మార్గమధ్యలో బంధువుల ఇంటి వద్ద ఉన్న అశ్రిన్‌ను బండిపై ఎక్కించుకుని ఇంటికి బయలుదేరారు. సరూర్‌నగర్‌ వద్ద వీరి వాహనాన్ని అడ్డగించిన నిందితులు నాగరాజుపై దాడికి దిగారు. సెంట్రింగ్‌ రాడ్‌తో కొట్టడంతోపాటు కత్తితో పొడిచారు. ఈ క్రమంలో స్థానికులు నిందితులను అడ్డుకుని దాడి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ చేయిం చి నిందితులకు  శిక్ష పడేలా చూస్తామని డీసీపీ చెప్పారు. కాగా, నాగరాజు మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో  పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున మార్చురీ వద్దకు వచ్చారు.

మరిన్ని వార్తలు