లింక్డిన్‌లో యువతి బయోడేటా.. ఉద్యోగం వస్తుందనుకుంటే నోటీసు వచ్చింది!

25 Jan, 2023 10:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నగర యువతి జాబ్‌ పోర్టల్‌ లింక్డిన్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్ల వల్లోపడింది. వైద్య రంగంలో ఉద్యోగం పేరుతో నమ్మించిన సైబర్‌ నేరగాడు బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకున్నాడు. వీటిని వినియోగించి పలువురిని రూ.38 లక్షల మేర ముంచాడు. మరోపక్క బాధితురాలికి ‘కస్టమ్స్‌ కథ’ చెప్పి రూ.2.36 లక్షలు కాజేశాడు. బెంగళూరు పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న యువతి సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.  

ఎన్నారై డాక్టర్‌గా పరిచయం చేసుకుని... 
కార్వాన్‌ ప్రాంతంలో ఉన్న యువతి తన బయోడేటాను లింక్డిన్‌లో అప్‌లోడ్‌ చేసింది. దీన్ని చూసిన సైబర్‌ నేరగాడు లండన్‌లో పని చేస్తున్న ఎన్నారై డాక్టర్‌గా పరిచయం చేసుకుంటూ వాట్సాప్‌ చేశాడు. బయోడేటా పరిశీలించానని, వైద్య రంగంలో ఉద్యోగమంటూ ఎర వేశాడు. అడ్వాన్స్‌గా జీతం డిపాజిట్‌ చేయడానికంటూ ఆమెకు సంబంధించిన కెనరా బ్యాంక్‌ ఖాతా వివరాలు సంగ్రహించాడు.

మాయ మాటలు చెప్పి ఆమె చెక్‌ బుక్, డెబిట్‌ కార్డులు ఢిల్లీ చిరునామాకు కొరియర్‌ చేయించుకున్నాడు. సాంకేతిక కారణాల పేరుతో బ్యాంకునకు లింకై ఉన్న ఫోన్‌ నెంబర్‌ సైతం మార్పించి తనది జోడించేలా చేశాడు. దేశ వ్యాప్తంగా అనేక మందిని వివిధ పేర్లతో మోసం చేసిన ఈ సైబర్‌ నేరగాడు వారితో డబ్బు డిపాజిట్‌ చేయించుకోవడానికి ఈ యువతి ఖాతా వాడాడు. తన వద్ద ఉన్న కార్డుతో ఏటీఎంల నుంచి డ్రా చేసేసుకున్నాడు. బాధితురాలి ఫోన్‌ నెంబర్‌ కూడా లింకై లేకపోవడంతో ఈ వివరాలేవీ ఆమెకు తెలియలేదు 

బెంగళూరు పోలీసుల నోటీసులు చూసి... 
ఓ సందర్భంలో తాను భారత్‌కు వస్తున్నానని, కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలో డైరెక్టర్‌గా నియమిస్తానంటూ సందేశాలు పంపాడు. ఇలా ఆమెను నమ్మించి మరో కథకు శ్రీకారం చుట్టాడు. ఓ రోజు తాను వస్తున్నానని, తనతో పాటు డబ్బు తీసుకువస్తున్నానని ఓ పెట్టె ఫొటో పంపాడు. ఇది జరిగిన రెండు రోజులకు ఢిల్లీ కస్టమ్స్‌ అధికారులుగా కొందరు ఫోన్లు చేశారు. ఫలానా వ్యక్తి భారీ మొత్తంలో విదేశీ కరెన్సీతో లండన్‌ నుంచి రావడంతో పట్టుకున్నామని చెప్పారు. అతడిని వదలిపెట్టడానికి ట్యాక్స్‌ కట్టాలంటూ అందినకాడికి వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేయించుకున్నారు. ఓ దశలో అతడు కూడా ఫోన్‌లో మాట్లాడి డబ్బు గుంజాడు.

ఇలా రూ.2.36 లక్షలు చెల్లించిన తర్వాత ఆమెకు బెంగళూరు పోలీసుల నుంచి నోటీసులు అందాయి. ఆమె పేరుతో కన్న కెనరా బ్యాంక్‌ ఖాతాలో రూ.38 లక్షల లావాదేవీలు జరిగాయని, వాటిని డిపాజిట్‌ చేసిన వాళ్లు సైబర్‌ నేరాల బాధితులని, దీంతో ఖాతా ఫ్రీజ్‌ చేశామని అందులో ఉంది. దీని ప్రకారం ఆమెనూ నిందితురాలిగా పరిగణించాలని భావించారు. ఈ నోటీసులు చూసిన తర్వాత తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు