నిశ్చితార్థం జరిగినా.. వీడియోలతో భయపెడుతూ పలుమార్లు అత్యాచారం

9 Jun, 2022 07:44 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

రసూల్‌పురా (హైదరాబాద్‌): ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి మోసం చేసిన యువకుడిపై తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ శ్రవణ్‌కుమార్‌ బుధవారం వివరాలు వెల్లడించారు. తిరుమలగిరి విలేజ్‌ దర్గా ప్రాంతానికి చెందిన యువతి లెక్చరర్‌గా పనిచేస్తుంది. 2017లో ఆమెకు అత్తాపూర్‌ కిషన్‌ బాగ్‌ ప్రాతానికి చెందిన దూరపు బంధువు నిహాల్‌ సింగ్‌తో పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం ప్రేమకు దారి తీసింది గత ఏడాది జూలై 1న అత్తాపూర్‌ వెళ్లిన  ఆమెను నిహాల్‌సింగ్‌ టెర్రస్‌ పైన ఉన్న గదికి రప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా నిహాల్‌ సింగ్‌ పలుమార్లు లాడ్జీలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా బాధితురాలు గత డిసెంబర్‌లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పగా నిశ్చితార్థం జరిగినా తాను పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికాడు.

చదవండి: (అశ్లీలం.. విశృంఖలం!.. ఇంటర్నెట్‌లో రాజ్యమేలుతున్న పోర్న్‌ వెబ్‌సైట్లు) 

గత ఫిబ్రవరిలో ఆమెకు నిశ్చితార్థం జరగడంతో తనను వదిలివేయాలని కోరగా తనతో కలిసి ఉన్న వీడియోలు తీశానని తన కోరిక తీర్చకపోతే వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడమేగాక కాబోయే భర్తకు కూడా పంపిస్తానని బెదిరించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేగాక నిహాల్‌ సూచన మేరకు పెళ్లి కూడా రద్దు చేసుకుంది. ఇటీవల తాను గర్భం దాల్చినట్లు గుర్తించిన బాధితురాలు పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేయడంతో ఈనెల 6న తల్లితో సహా తిరుమలగిరికి వచ్చిన నిహాల్‌ సింగ్‌ ఆమెను పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పడంతో బాధితురాలు మంగళవారం తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు