అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్.. అంతేనా వృద్ధురాలిని ఢీకొట్టి..

25 Jul, 2021 15:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడమేమో గానీ.. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, సీటు బెల్టు, హెల్మెట్‌ పెట్టుకోకపోవడం లాంటి కారణంగానే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ట్రాఫిక్‌ పోలీసులు చెప్తున్నారు. అయినా వాటిని బేఖాతరు చేస్తూ కొందరు పెడచెవిన పెడుతూ రోడ్డుపై ఇష్టారీతిన వాహనాలను నడుపుతున్నారు. రోడ్డుపై వాహనదారులు డ్రైవింగ్‌ చేసే సమయంలో నిర్లక్ష్యపు ధోరణిని వీడాలని, మితిమీరిన వేగంతో వాహనాలు నడపకూడదని అధికారులు ఎంత మొత్తుకున్నా ప్రజలు వినిపించుకోవడం లేదనే చెప్పాలి.

ఇటీవల ముగ్గరు యువకులు రోడ్డు పై అతి వేగంతో ‍ద్విచక్రవాహనాన్ని నడపడమే కాకుండా, ఓ ‍ప్రమాదానికి కారకులయ్యారు. చివరకి కటకటాలపాలయ్యరు. వివరాల్లోకి వెళితే.. జూలై 11న నార్సింగి సమీపాన ముగ్గురు యువకులు ట్రాఫిక్‌ రూల్స్‌ను పూర్తిగా పక్కన పెట్టి, ఇష్టారీతని డ్రైవింగ్‌ చేస్తూ వెళ్తున్నారు. అంతేగాక ఆ బండిని  మొదటి కుర్చున్న వ్యక్తి కాకుండా రెండో వ్యక్తి బైకుని నడుపుతున్నాడు. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు వారి వారి నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందని.

ఆ సమయంలోనే ఓ వృద్ధరాలు అటుగా రోడ్డు పక్కన నుంచి వెళ్తుంటే ఆమెను ఢీకోట్టి మరీ వెళ్లిపోయారు. కనీసం కింద పడిని వ్యక్తి ఎలా ఉందో, ఏమైందో అని కూడా చూడకుండా బండిని ఇంకా వేగంగా కదిలించేశారు. అదృష్టవశాత్తు ఆ వృద్ధరాలు స్వల్ప గాయాలతో బయటపడింది. ఇదంతా ఆ చుట్టు పక్కల సీసీ కెమరాలో రికార్డు కావడంతో పోలీసులు ఆ బైకుపై ప్రయాణించిన వారిలో ఇద్దరు దొరకగా వారిపై కేసు నమోదు చేశారు. ఓ సారి ఈ ప్రమాదాలు చిట్టాను పరిశీలిస్తే 2019 నుంచి 2021 మే వరకు ప్రతీ ఏటా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు