బెదిరించి.. 2 గంటల పాటు గదిలో బంధించి.. ఆపై

13 Aug, 2021 08:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ కో ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ తనను బెదిరింపులకు గురిచేయడంతో పాటు రెండుగంటల పాటు గదిలో బంధించారంటూ కార్యదర్శి మురళీ ముకుంద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం జరిగిన పాలకమండలి సమావేశంలో అధ్యక్షుడు రవీంద్రనాథ్‌తో పాటు కొంతమంది సభ్యులు రికార్డు గది తాళాలను చేజిక్కించుకునేందుకు ప్రయత్నించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

► మార్చిలో జరిగిన పాలకమండలి ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో అధ్యక్షుడిగా రవీంద్రనాథ్, కార్యదర్శిగా మురళీ ముకుంద్‌తో పాటు పాలకమండలి ఏర్పాటైంది. కొన్నిరోజులుగా పాలకమండలిలోని సభ్యుల మధ్య విభేదాలు నడుస్తున్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌నెం–78లోని స్థలం కేటాయింపు వ్యవహారంలో అధ్యక్షుడు రవీంద్రనాథ్‌తో పాటు కోశాధికారిపై ఆరోపణలు రావడంతోపాటు కేసు నమోదైంది.  

► సొసైటీలో గతంలో చేసిన అవకతవకలకు వ్యతిరేకంగా గెలిచిన కొత్త ప్యానెల్‌పై కూడా అవినీతి మరకపడటంతో పాలకమండలి సభ్యుల్లో కొంతమంది మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాలకమండలి సమావేశంలో రసాభాసా చోటు చేసుకుంది. సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌కు, కార్యదర్శి మురళీముకుంద్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.  

►  సొసైటీలో జరిగిన వ్యవహారాలపై సాక్ష్యాలుగా ఉండే కొన్ని ఫైళ్లు మాయమైనట్లు ఆరోపణలు రావడంతో ఈ విషయంపై జోరుగా చర్చ నడిచినట్లు తెలుస్తోంది. కాగా సొసైటీ రికార్డు రూమ్‌ తాళాలను తనకు ఇవ్వాలంటూ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌తో పాటు కొంతమంది సభ్యులు తనను విపరీతమైన ఒత్తిడికి గురిచేశారని, తనను సుమారు 2గంటల పాటు గదిలో బంధించారంటూ గురువారం సాయంత్రం సొసైటీ కార్యదర్శి మురళీ ముకుంద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

► సొసైటీ బైలాస్‌ ప్రకారం లాకర్‌ రూమ్‌లోని ఫైళ్లను కాపాడడం తన బాధ్యత అని, తాళాలను లాక్కోవడం కోసం ప్రయతి్నంచడంతోపాటు తనను బెదిరింపులకు గురిచేసిన సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ తదితరులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.  

► పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రికార్డు గదిని సీజ్‌ చేశారు. సొసైటీలో గందరగోళ పరిస్థితి నెలకొందని, వెంటనే ప్రత్యేక అధికారిని నియమించి ఫైళ్లను రక్షించాలంటూ కార్యదర్శి మురళీముకుంద్‌ సహకారశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా మురళీ ముకుంద్‌ ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించినట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపారు.   

మరిన్ని వార్తలు