‘అమ్మా..నాన్నా.. క్షమించండి.. మీ అంచనాలు, ఆశలు అందుకోలేకపోతున్నా'

8 Sep, 2022 07:12 IST|Sakshi

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని బలవన్మరణం

పరీక్ష సరిగా రాయలేకపోయానని మనస్తాపంతో ఆత్మహత్య

నేడు ఆ విద్యార్థిని జన్మదినం

గత ఏడు నెలల్లో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య

ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఈ పాటికి ఆ అమ్మాయి నవ్వుతూ ఇంటిలో ఉండేది. ఒక్క రోజు గడిస్తే చక్కగా కుటుంబ సభ్యులతో పుట్టిన రోజు వేడుకలు చేసుకుని ఉండేది. కానీ ఆ విద్యార్థిని సంయమనం చూపలేకపోయింది. తెలివితేటలతో ప్రతిష్టాత్మక ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించిన విద్యార్థిని తన మనసుకు మాత్రం కరెక్ట్‌ సమాధానం చెప్పుకోలేకపోయింది. ఒక్క పరీక్షతో జీవితం ఆగిపోదన్న నిజాన్ని అర్థం చేసుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఆశలు పెట్టుకున్న అమ్మానాన్నలకు క్షమాపణలు చెబుతూ బలవంతంగా ఊపిరి ఆపుకుంది. శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో పీయూసీ రెండో ఏడాది చదువుతున్న భవిరి విశిష్ట రోషిణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.    

సాక్షి, శ్రీకాకుళం(ఎచ్చెర్ల క్యాంపస్‌): ‘అమ్మా..నాన్నా.. క్షమించండి. మీ అంచనాలు, ఆశలు అందుకోలేకపోతున్నాను. పరీక్ష మెరుగ్గా రాయలేకపోతున్నాను. తమ్ముడిని బాగా చదివించండి’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి శ్రీకాకుళం రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ) ఎస్‌ఎం పురం క్యాంపస్‌ విద్యార్థిని భవిరి విశిష్ట రోషిణి (17) బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది.

విద్యార్థిని క్యాంపస్‌లో ప్రీ యూనివర్సిటీ కోర్సు (పీయూసీ) రెండో ఏడాది చదువుతోంది. ప్రస్తుతం రెండో ఏడాది చివరి సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. బుధవారం చివరి పరీక్ష ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) ఎగ్జామ్‌ జరిగింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. అయితే ఈ విద్యార్థిని 11 గంటలకే పరీక్ష ముగించేసి వసతి గృహంలోని తన గదికి వచ్చేసింది. పరీక్ష సరిగా రాయలేకపోయాననే భావనతో సూసైడ్‌ నోట్‌ రాసి బ్లాక్‌ 1లో ఉన్న తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. మిగతా విద్యార్థులు పరీక్ష పూర్తి చేసుకు ని వచ్చే సరికి రోషిణి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వారు భయపడి కేర్‌ టేకర్‌ జి.జయలక్ష్మికి చెప్పగా.. ఆమె అధికారులకు సమాచారం ఇచ్చారు.

సంఘటనకు చేరుకున్న పరిపాలన అధికారి రమేష్‌నాయుడు, అధ్యాపకులు విద్యార్థినిని కిందకు దించి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అయితే విద్యార్థిని మృతి చెందినట్లు వై ద్యులు నిర్ధారించారు. వెంటనే విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు ఎచ్చెర్ల పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ టి.సత్యనారాయణ విద్యార్థిని ఫోన్‌తో పా టు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్‌ టీమ్‌ వచ్చి సాక్ష్యాలు సేకరించింది. చదువు ఒత్తిడి కారణంగానే విద్యార్థిని క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

తెలివైన విద్యార్థిని.. 
రోషిణి చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిని. పీయూసీ మొదటి ఏడాది, రెండో ఏడాది మొదటి సెమిస్టర్‌లోనూ 9.3 క్రెడిట్స్‌ సాధించి మంచి స్థానంలో ఉంది. చివరి పరీక్షకు సైతం శ్రమించి చదివి సన్నద్ధమైంది. అనుకున్న రీతిలో పరీక్ష రాయలేకపోవడంతో అసంతృప్తికి లోనయ్యింది. కోవిడ్‌ నేపథ్యంలో 10వ తరగతి పాస్‌ అయినా ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించింది. ప్రారంభంలో మొదటి కౌన్సెలింగ్‌లో న్యూజివీడు క్యాంపస్‌ ఎంచుకుంది. సాలూరు శ్రీకాకుళానికి దగ్గర కావటంతో రెండో కౌన్సెలింగ్‌లో శ్రీకాకుళం క్యాంపస్‌ ఎంచుకుంది. తల్లిదండ్రులు సైతం తరచూ వచ్చి కలుస్తుండేవారు.
 
నేడు బర్త్‌డే.. 
గురువారం రోషిణి పుట్టిన రోజు. సెమిస్టర్‌ పరీక్షలు బుధవారం ముగియటంతో విశ్రాంతి కోసం మూడు రోజులు ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కుటుంబంతో కలిసి గురువారం జన్మదినం జరుపుకోవాలనుకుంది. 18వ ఏటలోకి అడుగు పెట్టాల్సిన విద్యార్థిని ఏకంగా లోకాన్నే విడిచి వెళ్లిపోయింది.

ది రెండో ఘటన..  
శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో ఏడు నెలల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. విజయనగరం జిల్లా నెల్లిమెర్లకు చెందిన పీయూసీ మొదటి సంవత్స రం విద్యార్థిని కొండపల్లి మనీషా అంజు ఫిబ్రవరి 16న ఆత్మహత్యకు పాల్పడింది. విద్యాసంస్థలో చేరిన కొన్ని రోజులకే ఇంటిపై బెంగ (హోం సిక్‌తో) విద్యార్థిని మృతి చెందగా, ప్రస్తుతం విశిష్ట రోషిణి చదువు ఒత్తిడి కారణంగా చనిపోయింది.  

కన్నీరుమున్నీరు.. 
విశిష్ట రోషిణిది మన్యం జిల్లా సాలూరు పట్టణం తట్టికోట వీధి. తండ్రి బ్యాంకులో బంగారు నగల నిర్ధారణ పనిచేస్తుంటారు. తల్లి సౌజన్య గృహిణి. వీరికి 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు. కుమార్తె మృతి విషయం తెలియగానే తల్లిదండ్రులు శ్రీకాకుళం రిమ్స్‌కు చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఇక క్యాంపస్‌లో విద్యార్థులు ఈ ఘటనతో హడలిపోతున్నారు. పరీక్షలు ముగియటం, మూడు రోజులు ఇళ్లకు వెళ్లే అవకాశం ఇవ్వటంతో తల్లిదండ్రులకు స మాచారం ఇచ్చి దగ్గరలో ఉన్నవారు ఇళ్లకు వెళుతున్నారు. మరోపక్క క్యాంపస్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.  

మరిన్ని వార్తలు