ఆ బెంగతో ఏకంగా ప్రాణాలే తీసుకుంది

17 Feb, 2022 06:26 IST|Sakshi
కొండపల్లి మనీష అంజు (ఫైల్‌)  

సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్‌: ప్రతిభావంతురాలైన ఓ విద్యార్థిని ప్రయాణం అర్ధంతరంగా ఆగిపోయింది. పోటీ పరీక్షల్లో సత్తా చాటిన అమ్మాయి జీవితంలో మాత్రం ఆ తెగువ,తెలివి చూపలేకపోయింది. ఇంటిపై బెంగ పెట్టుకుని ఏకంగా ప్రాణాలే తీసుకుంది. ఆలోచనలకు అడ్డుకట్ట వేయలేక, వెంటాడుతున్న మనోవ్యధను భరించలేక, సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో పాలుపోక బంగారు భవిష్యత్తు ఉన్న యువతి బలవన్మరణానికి పాల్పడింది. శ్రీకాకుళం రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్‌ ఐటీ) ఎస్‌ఎం పురం క్యాంపస్‌లో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న కొండపల్లి మనీష అంజు(16) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ విద్యార్థిని స్వస్థలం విజయనగరం జిల్లా నెల్లిమర్ల.  

అనారోగ్యం అని చెప్పి.. 
ఈ ఏడాది టెన్త్‌ క్లాస్‌లో కోవిడ్‌ కారణంగా అందరినీ పాస్‌ చేసేశారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు పోటీ పరీక్ష నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన మనీష అంజు శ్రీకాకుళం క్యాంపస్‌లో సీటు సంపాదించింది. ఈమెకు కాలేజీ హాస్టల్‌లోని ఎస్‌–4 గదిని మరో ఇద్దరు విద్యార్థినులు అక్షిత, యమునలతో కలిపి కేటాయించారు. యమున ఇంకా రిపోర్ట్‌ చేయలేదు. అక్షిత మాత్రం ఇదే గదిలో ఉంటూ బుధవారం క్లాసుకు వెళ్లిపోయింది. మనీష తనకు ఆరోగ్యం బాగోలేదని, విశ్రాంతి తీసుకుంటానని కేర్‌టేకర్‌కు చెప్పి ఆమె గదిలోకి వెళ్లిపోయింది. ఉదయం అంతా క్లాసులకు వెళ్లిపోయాక 10.30 గంటల ప్రాంతంలో గదిలోని ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది.

చదవండి: (13 మంది విద్యార్థినులపై అత్యాచారం.. టీచర్‌కు..)

మధ్యాహ్నం తోటి విద్యార్థినులు ఆమెను భోజనానికి పిలవడానికి గది వద్దకు వచ్చారు. తలుపులు కొట్టగా ఎవరూ తీయలేదు. దీంతో వారు కేర్‌ టేకర్‌కు సమాచారం అందించారు. అనంతరం తలుపులు బద్దలుగొట్టి చూస్తే ఫ్యాన్‌కు వేలాడుతూ మనీష కనిపించింది. దీంతో కేర్‌ టేకర్‌ కంగారు పడి డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీశ్వరరావు, పరిపాలన అధికారి కె.మోహన్‌కృష్ణ చౌదరిలకు సమాచారం చేరవేశారు. తర్వాత మనీషను కిందకు దించి అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ట్రిపుల్‌ ఐటీ అధికారులు ఎచ్చెర్ల పోలీసులకు, విద్యార్థిని తల్లిదండ్రులు సూరిబాబు, కరుణకుమారిలకు సమాచారం చేరవేశారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ కె.రాము ఆధ్వర్యంలో పోలీసులు, క్లూస్‌ టీమ్‌ సభ్యులు విచారణ నిర్వహించి, ఆధారాలు సేకరించారు. తోటి విద్యార్థినులను విచారించారు.   

ఇంటిపై బెంగ పెట్టుకుందా..? 
మనీష అంజు చురుకైన విద్యార్థిని. ప్రాథమిక విద్యలో మంచి ప్రతిభ కనబరిచి ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైంది. ఇక్కడ పీయూసీ మొదటి ఏడాది, మొదటి సెమిస్టర్‌ క్లాస్‌ వర్క్‌ సంక్రాంతి పండగ ముందు 15 రోజులు నిర్వహించారు. అనంతరం కరోనా నేపథ్యంలో విద్యాసంస్థకు సెలవులు ప్రకటించారు. మొదటి ఏడాది విద్యార్థులకు క్యాంపస్‌ అలవాటు చేసేందు ఆఫ్‌లైన్‌ క్లాస్‌వర్క్‌ను ఈ నెల 14న ప్రారంభించారు. ఈమె రెండు రోజుల పాటు క్లాస్‌కు హాజరైంది. కానీ ఇక్కడ తనకు నచ్చడం లేదని, ఇల్లు గుర్తుకు వస్తోందని తోటి వారితో తరచూ చెప్పేది. తల్లిదండ్రులతో రోజూ మాట్లాడేది.

రెండు రోజుల కింద తల్లి స్వయంగా వచ్చి ఆమెను క్యాంపస్‌లో దించి వెళ్లారు. సంక్రాంతి ముందు కూడా ఆమె తండ్రి 15 రోజుల్లో రెండుసార్లు వచ్చి చూశారు. విద్యార్థిని ఇంటికి వెళ్లినప్పుడు కూడా తాను కాలేజీకి వెళ్లనని చెప్పినట్లు సమాచారం. తల్లిదండ్రులను విడిచి ఇక్కడ ఉండలేకే విద్యార్థి ఇలా చేసుకుందని తోటివారు భావిస్తున్నారు. ఈ క్యాంపస్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. కూతురు చనిపోయిందన్న వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.  

మరిన్ని వార్తలు