IIT Hyd Suicide Case: ఇంపార్టెంట్‌ టెక్ట్స్‌.. ప్లీజ్‌ సీ ల్యాప్‌టాప్‌.. పుట్టినరోజు జరుపుకున్న రెండు రోజులకే.. 

2 Sep, 2022 03:00 IST|Sakshi
రాహుల్‌ (ఫైల్‌)

సూసైడ్‌నోట్‌ రాసి ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

థీసిస్‌ పర్పస్‌లెస్‌ అని రాసి కొట్టేసిన మరో నోట్‌ స్వాధీనం 

ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లను సైబర్‌ నిపుణులకు పంపిన పోలీసులు 

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్‌ ఐఐటీలో ఎంటెక్‌ (స్మార్ట్‌ మొబిలిటీ) చదువుతున్న బింగుమల్ల రాహుల్‌ (25) ఆత్మహత్య చేసుకున్నా రు.  ఐఐటీహెచ్‌లోని కౌటిల్య బ్లాక్‌ హాస్టల్లో ఉంటున్న రాహుల్‌.. తన గదిలోని మంచం రాడ్‌కు నైలాన్‌ తాడుతో ఉరివేసుకుని బలవన్మరణం పొందారు. ‘ఇంపార్టెంట్‌ టెక్ట్స్‌.. ప్లీజ్‌ సీ ల్యాప్‌టాప్‌..’అని రాహుల్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ కలకలం రేపుతోంది.

‘థీసిస్‌ పర్పస్‌లెస్‌’అని రాసి కొట్టేసిన మరో నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని సైబర్‌ నిపుణుల బృందానికి పంపారు. రాహుల్‌ కాల్‌ లిస్ట్, చాటింగ్‌ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ ఓపెన్‌ అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశాలున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు డీఎస్పీ రవీందర్‌ రెడ్డి చెప్పారు. రాహుల్‌ స్వస్థలం కర్నూల్‌ జిల్లా నంద్యాల. అక్కడే పుల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తి చేశారు. 

పుట్టినరోజు జరుపుకున్న రెండు రోజులకే.. 
ఆగస్టు 27 (శనివారం)న పుట్టినరోజు జరుపుకు న్న రాహుల్‌ సోమవారం రాత్రి నుంచి తమకు కనిపించలేదని తోటి విద్యార్థులు పేర్కొంటున్నారు. రాహుల్‌కు ఫోన్‌ చేసినా స్పందనలేకపోవడంతో అనుమానం వచ్చి విద్యార్థులు తలుపు సందులోంచి హాస్టల్‌ గదిలోకి చూడగా కాళ్లు వేలాడుతూ కనిపించాయి. లోపల గడియ పెట్టి ఉండటంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా, మంచానికి ఉరి వేసుకుని కనిపించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

వెంటనే ఘటనాస్థలాన్ని వీడియో తీసి రాహుల్‌ తండ్రి మధుసూదన్‌రావుకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చిన వెంటనే రాహుల్‌ మృతదేహానికి సంగారెడ్డి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఉరి వేసుకోవడంతో కంఠానికి ఉన్న థైరాయిడ్‌ బోన్‌ ఫ్రాక్చర్‌ అయినట్లు పోస్టుమార్టంలో తేలినట్లు తెలిసింది. చేతికి గాయమై రక్తం కారినట్లు సమాచారం.

పుట్టినరోజు జరుపుకున్న 48 గంటల్లోపే ఆత్మహత్య చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, 2008లో ఐఐటీహెచ్‌ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మానసిక ఒత్తిడి, తోటి విద్యార్థులకు పోటీగా నిలవాలనే తాపత్రయంతో ఒత్తిడికి గురికావడం వంటి కారణాలతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థు లు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

అంతర్గత విచారణ చేశాం 
‘రాహుల్‌ ఆత్మహత్యపై అంతర్గత విచారణ చేశాం. దీనికి విద్యాసంబంధ కారణాలేమీ ఉండకపోవచ్చని భావిస్తున్నాం. వ్యక్తిగత సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చు’అని ఫ్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి ‘సాక్షి’తో పేర్కొన్నారు. 

అనుమానంగా ఉంది: మధుసూదన్‌రావు, రాహుల్‌ తండ్రి 
తన కుమారుడి మృతి పట్ల రాహుల్‌ తండ్రి మధుసూదన్‌రావు అనుమానం వ్యక్తం చేశారు. ఎవరైనా ఫ్యాన్‌కు ఉరివేసుకుంటారని, మంచానికి ఉరివేసుకోవడమేంటని పేర్కొన్నారు. పోస్టుమార్టం నిర్వహించక ముందే తన కుమారుడి ముఖం చూడాలని ప్రాధేయపడినా వైద్యాధికారులు అంగీకరించకపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. పోస్టుమార్టం అనంతరం రాహుల్‌ మృతదేహాన్ని నంద్యాలకు తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు