నడిగడ్డ.. నకిలీ లిక్కర్‌ అడ్డా

15 Feb, 2022 02:56 IST|Sakshi
పట్టుబడిన నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎక్సైజ్‌ ఉప కమిషనర్‌ దత్తురాజుగౌడ్‌

పాతపాలెంలో మద్యం రాకెట్‌ గుట్టురట్టు.. 9 మందిపై కేసు

బెల్ట్‌షాపుల్లో గోవా, కర్ణాటక లిక్కర్‌ లేబుళ్లతో సరఫరా

ఏపీకి సైతం అక్రమంగా రవాణా

తెరవెనుక ఓ ముఖ్య ప్రజాప్రతినిధి!

బెడిసికొట్టడంతోనే దాడులు జరిగినట్టు ఆరోపణలు

దందాలో భాగమైన ఇద్దరు ఉద్యోగులను తప్పించినట్లు అనుమానాలు?

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఇప్పటికే నకిలీ పత్తివిత్తనాలు, నకిలీకల్లు, రేషన్‌ రీసైక్లింగ్‌తో అక్రమాలకు అడ్డాగా మారిన నడిగడ్డలో మరో నకిలీ వ్యవహారం బయటపడింది. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాతపాలెంలో నకిలీ లిక్కర్‌ తయారీ దందా బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నకిలీ మద్యాన్ని గోవా, కర్ణాటక లిక్కర్‌ పేరిట చుట్టుపక్కల ప్రాంతాల్లోని బెల్ట్‌షాపులకు సరఫరా చేయడంతోపాటు బ్రాండెడ్‌ లేబుళ్లతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా రవాణా చేస్తున్నట్లు వెల్లడైంది. 

ముఠా పట్టుబడిందిలా..
రెండురోజుల క్రితం కర్ణాటక నుంచి స్పిరిట్‌ (100శాతం ప్యూర్‌ ఆల్కహాల్‌) లోడ్‌తో కారు వస్తున్నట్టు సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ పోలీసులు.. గద్వాల జిల్లా పాతపాలెం వద్ద కాపు కాసి పట్టుకున్నారు. 70 లీటర్ల (2 క్యాన్లు) స్పిరిట్‌ను, వాహనాన్ని నడుపుతున్న పాతపాలెం నివాసి వీరేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టు తెలిసింది. దీనితో ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు ఆదివారం పాతపాలెంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న గోపి అనే వ్యక్తి ఇంటిపై దాడులు చేశారు.

నకిలీ మద్యం తయారుచేసే యంత్రం, బ్రాండెడ్‌ మద్యానికి సంబంధించిన నకిలీ లేబుళ్లు, ఫ్లేవర్, 35 లీటర్ల స్పిరిట్‌ డబ్బా, 50 ఇంపీరియల్‌ బ్లూ మద్యం సీసాల కాటన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాతో సంబంధమున్న అలంపూర్‌ మండలం బొంగూరుకు చెందిన లోకేశ్‌గౌడ్, కల్లుకుంట్లకు చెందిన నాగరాజుగౌడ్, సింగవరానికి చెందిన బాబుగౌడ్, మల్దకల్‌ మండలం మద్దెలబండకు చెందిన ఈరన్నగౌడ్‌ ఇళ్లలోనూ సోదాలు చేశారు.

బాబుగౌడ్‌ ఇంట్లో 140 లీటర్ల స్పిరిట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ ముఠా కర్ణాటక నుంచి స్పిరిట్‌ తీసుకొచ్చి నకిలీ మద్యం తయారుచేసి, గద్వాల జిల్లా, పరిసర ప్రాంతాలతోపాటు ఏపీలోని కర్నూల్‌ జిల్లాలోని బెల్టుషాపులకు విక్రయిస్తున్నట్టు విచారణలో గుర్తించారు. కర్నూల్‌కు చెందిన నారాయణగౌడ్, రాయచూర్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్‌లకు దందాలో భాగస్వామ్యం ఉన్నట్టు తేల్చారు.

8 మంది అరెస్టు..
నకిలీ మద్యం ముఠా, దాడుల వివరాలను ఎక్సైజ్‌ ఉప కమిషనర్‌ దత్తురాజుగౌడ్‌ సోమవారం వెల్లడించారు. మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసి, ఎనిమిది మందిని అరెస్టు చేశామని, రాయచూర్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్‌ పరారీలో ఉన్నాడని తెలిపారు. మొత్తంగా రూ.15 లక్షల విలువైన 210 లీటర్ల స్పిరిట్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.

కీలక ప్రజాప్రతినిధి అండతో..!
నకిలీ మద్యం దందాలో.. పాతపాలెంకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి, మరో ప్రభుత్వ ఉద్యోగి సోదరుడు భాగస్వాములుగా ఉన్నారని, ఇన్నాళ్లుగా అక్రమార్కులకు జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల గ్రామదేవతల ఉత్సవాల నేపథ్యంలో సదరు కీలక ప్రజాప్రతినిధితో వ్యవహారం బెడిసికొట్టిందని.. ఈ క్రమంలోనే నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడులు జరిగాయని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ఆ ముఖ్య ప్రజాప్రతినిధి వద్ద గతంలో పనిచేయగా.. అతడి సోదరుడు మద్యం దందాలో పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే వారిని ఈ కేసు నుంచి తప్పించినట్టు ప్రచారం జరుగుతోంది.

కర్ణాటక నుంచి స్పిరిట్‌.. గుట్టుగా బెల్టుషాపులకు..
గద్వాల నియోజకవర్గంలో కేటీదొడ్డికి కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా సరిహద్దుగా ఉంది. అక్కడి నుంచి స్పిరిట్‌ (100శాతం ప్యూర్‌ ఆల్కాహాల్‌) గద్వాల జిల్లాకు సరఫరా అవుతోంది. రాయచూర్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్‌ ఈ స్పిరిట్‌ కొనుగోలు, అమ్మకం, రవాణాలో కీలకమని సమాచారం. ఇక గోపి, వీరేశ్, వీరేశ్‌గౌడ్, లోకేశ్‌ గౌడ్, నాగరాజుగౌడ్‌ తదితరులు ఆ స్పిరిట్‌ను ఉపయోగించి నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ.. స్థానికంగా బెల్టుషాపులకు సరఫరా చేస్తుంటారని తెలిసింది.

మరోవైపు ఆలంపూర్‌ నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా సరిహద్దుగా ఉండటంతో.. ఆ జిల్లా మీదుగా ఏపీలోకి రవాణా చేస్తున్నారు. కర్నూల్‌కు చెందిన నారాయణగౌడ్‌ స్థానికంగా, గద్వాల జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో బెల్ట్‌షాపులకు నకిలీ మద్యం సరఫరాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. వీరంతా కొన్నేళ్లుగా చైన్‌ పద్ధతిలో మద్యం తయారీ, అమ్మకాలు చేస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. అంతేకాదు.. ఈ ముఠాలో ఐదుగురికి బినామీ పేర్లతో వైన్స్‌షాపుల భాగస్వామ్యం ఉందని, అయినా డబ్బుల కోసం నకిలీ మద్యం దందాకు దిగారని అంటున్నారు.

నకిలీ మద్యం తయారీ ఇలా..
కర్ణాటక నుంచి వచ్చిన స్పిరిట్‌ను ఉపయోగించి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. బ్రాండెడ్‌ మద్యం వాసన, రంగు వచ్చేలా ఫ్లేవర్లు, నీళ్లు కలుపుతున్నట్టు తేల్చారు. అనుమానం రాకుండా చీప్‌ లిక్కర్‌ బాటిళ్లలో నింపి, లేబుళ్లు కూడా అతికించి బెల్ట్‌ షాపులకు సరఫరా చేస్తున్నారు.

మరిన్ని వార్తలు