ఆదోనిలో ప్రబలిన అతిసారం

8 Apr, 2021 03:20 IST|Sakshi
చిన్నారులను పరామర్శిస్తున్న ఆర్డీవో రామకృష్ణారెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో రంగనాయక్‌

50 మందికి అస్వస్థత.. ఒకరి మృతి

ఆరుగురి పరిస్థితి విషమం

ఆదోని/అర్బన్‌: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అరుంజ్యోతినగర్‌లో బుధవారం అతిసారం ప్రబలింది. 50 మందికిపైగా అస్వస్థతకు గురికాగా.. ఒక మహిళ రంగమ్మ (50) మృతి చెందింది. బాధితుల్లో 20 మంది పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరికి  స్థానిక అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో వైద్యం చేస్తుండగా మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. బాధితుల్లో పదేళ్లలోపు వయసు కలిగినవారు 8 మంది ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ తాగునీరు, పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు చేపట్టాలని ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డిని ఆదేశించారు. ఆర్డీఓతో పాటు మునిసిపల్‌ కమిషనర్‌ ఆర్జీవీ కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ రంగనాయక్, తహసీల్దారు రామకృష్ణ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.

ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి పంపించినట్లు ఆస్పత్రి చీఫ్‌ డాక్టర్‌ లింగన్న వారికి తెలిపారు. అనంతరం ఆర్డీవో తదితరులు అరుంజ్యోతినగర్‌లో పర్యటించి.. ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, మురుగుకాలువలను శుభ్రం చేయించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచారు. తాగునీరు కలుషితం అవడంవల్లే అతిసారం ప్రబలిందని స్థానికులు తెలిపారు. తాగునీటి నమూనాలను పరీక్షలకు పంపినట్లు ఆర్డీవో చెప్పారు. మంగళవారం ఇక్కడ దేవర జరిగిందని, ఫుడ్‌ పాయిజనింగ్‌కు కూడా అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 

గోరుకల్లులో మరొకరు మృతి
పాణ్యం: కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం గోరుకల్లు గ్రామంలో అతిసారవ్యాధికి మరొకరు బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మంగళవారం గ్రామానికి చెందిన ఉప్పరి ఎరబోయిన ఉసేని (65), సుంకరి ఎల్ల కృష్ణ (35) చనిపోగా.. బుధవారం తమ్మడపల్లె మద్దమ్మ (75) నంద్యాల సమీపంలోని శాంతిరాం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. గ్రామంలో బుధవారం నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పర్యటించారు. 

మరిన్ని వార్తలు