మహిళలను వేధించే పోకిరీలకు జైలు శిక్ష!

28 Aug, 2022 08:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహిళలను వేధించడం, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న పోకిరీలకు న్యాయస్థానం జరిమానాతో పాటు 2 నుంచి 8 రోజుల పాటు జైలు శిక్ష విధించింది. హైదరాబాద్‌ షీ టీమ్స్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఏక్‌ షామ్‌ చారి్మనార్‌ కే నామ్‌’ కార్యక్రమానికి వచ్చిన మహిళలను వెంబడిస్తూ.. వారితో అసభ్యకరంగా ప్రవర్తించిన మల్లేపల్లిలో ఉంటున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రిజ్వాన్‌ ఖాన్, అబ్దుల్‌ హాజీ, మహమ్మద్‌ అద్నాన్‌లను సిటీ షీ టీమ్స్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. స్కూల్‌ విద్యార్థిని వెంబడించిన సోమాజీగూడకు చెందిన కరుణాకర్, బాధితురాలిని సోషల్‌ మీడియాలో వేధించిన నిందితులు మారేడుపల్లికి చెందిన ఏ ప్రవీణ్, బీ రాకేష్‌, కే శామ్యూల్‌లను షీ టీమ్స్‌ అదుపులోకి తీసుకున్నాయి.  

ప్రేమ కాదంటే వేధింపులు.. 

  • మహంకాళికి చెందిన సి. సోహ్రాబ్‌ వ్యాస్‌ అనే వ్యక్తికి,  బాధితురాలికి మధ్య కొంత కాలం ప్రేమ వ్యవహారం నడిచింది.  వీరి పెళ్లికి ఇరువర్గాల పెద్దలు అంగీకరించకపోవడంతో ఆ బంధానికి తెరపడింది. అయితే సోహ్రాబ్‌ అంతకు ముందు బాధితురాలితో దిగిన ఫొటోలను ఆమె బంధువులకు, స్నేహితులకు పంపించి మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు షీ టీమ్‌ నిందితుడిని అదుపులోకి తీసుకుంది. 
  • ఫేస్‌ బుక్‌ ద్వారా పరిచయమైన బోయినపల్లికి చెందిన ఖతిక్‌ ఆకాష్‌ సుంకర్నును ఓ యువతి ప్రేమించింది. ఏడాదిన్నర తర్వాత వీరిద్దరూ విడిపోయారు. కానీ, గత కొద్ధి కాలంగా నిందితుడు బాధితురాలికి తరుచూ సందేశాలు పెట్టడం, ఆమె వ్యక్తిగత, ఆఫీసు మెయిల్‌ ఐడీలకు మెయిల్స్‌ పెట్టడం చేస్తున్నాడు. దీంతో బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించడంతో నిందితుడు ఆకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 
  • డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న జే నరేందర్‌ కొంతకాలం బాధితురాలితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఆపై అభిప్రాయబేధాలతో విడిపోయారు. అప్పటినుంచి అతను గతంలో తనతో దిగిన ఫొటోలను బయటపెడతానని బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగడంతో  బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. దీంతో నిందితుడిని అరెస్టు చేశారు.  
  • ఈ నిందితులనందరినీ తగిన సాక్ష్యాధారాలతో న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కోర్టు నిందితులకు రెండు నుంచి ఎనిమిది రోజుల జైలు శిక్షను విధించిందని హైదరాబాద్‌ షీ టీమ్‌ అదనపు జాయింట్‌ కమిషనర్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.   

(చదవండి: నలుగురు దొంగలు.. రూ.12 కోట్ల ఫోన్లు కొట్టేశారు!)

మరిన్ని వార్తలు