చెత్తకుప్పలో నవజాత ఆడశిశువు

23 Aug, 2021 02:45 IST|Sakshi
శిశువును తీసుకువెళుతున్న ఎస్సై 

నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలో ఘటన

నాగర్‌కర్నూల్‌ క్రైం: తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రపోవాల్సిన నవజాత శిశువు చెత్తకుప్పలోకి చేరింది. కళ్లు తెరవని పసికందు చెత్తకుప్పల నడుమ ఆకలికేకలతో దర్శనమిచ్చింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రం శివారులోని గొల్లగేరి సమీపంలో ఉన్న డంపింగ్‌ యార్డులో చెత్తకుప్పల మధ్య ఆదివారం ఓ నవజాత ఆడశిశువు కన్పించింది. శిశువు ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్సై విజయ్‌కుమార్‌ శిశువును ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందని, ఐదురోజుల ఆడశిశువుగా గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. కాగా, డంపింగ్‌యార్డులో శిశువు ను వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తుల ఆచూకీ కోసం పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు