కోలీవుడ్‌లో సోదాల కలకలం

7 Aug, 2022 04:51 IST|Sakshi

తమిళ సినీ నిర్మాతలు, ఫైనాన్షియర్ల ఇళ్లల్లో ఐటీ సోదాలు

రూ.200 కోట్ల నల్లధనం గుర్తింపు

న్యూఢిల్లీ: పలువురు తమిళ సినీ నిర్మాతలు, ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్ల నివాసాల్లో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ఇటీవల సోదాలు నిర్వహించిందని, ఈ సోదాల్లో రూ.200 కోట్లకుపైగా నల్లధనాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 2 నుంచి మూడు రోజులపాటు చెన్నై, మదురై, కోయంబత్తూరు, వెల్లూరు తదితర నగరాల్లో దాదాపు 40 చోట్ట సోదాలు జరిపినట్లు పేర్కొంది. లెక్కల్లో చూపని రూ.26 కోట్ల నగదుతోపాటు రూ.3 కోట్లకుపైగా విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేసింది.

బహిర్గతం చేయని నగదు లావాదేవీలు, పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లు, డిజిటల్‌ పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. తమిళ నిర్మాతలు కలైపులి ఎస్‌.థాను, అన్బుసెళియన్, ఎస్‌ఆర్‌ ప్రభు, జ్ఞానవేల్‌ రాజా తదితరులు కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. సదరు నిర్మాతలు సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తక్కువ చేసి చూపినట్లు అధికారులు గుర్తించారు. కొందరు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి, ఆ సొమ్మును లెక్కల్లో చూపలేదని అధికారులు తేల్చారు.

మరిన్ని వార్తలు