తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌పై ఐటీ గురి

4 Mar, 2021 03:44 IST|Sakshi

ముంబై, పుణెలో 30 చోట్ల ఐటీ దాడులు 

మోదీ విధానాలను కాదన్నందుకే: ‘మహా’మంత్రులు  

ముంబై: పన్ను ఎగవేత ఆరోపణలపై బాలీవుడ్‌ నటి తాప్సీ పన్ను, బాలీవుడ్‌ నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ నివాసాల్లో బుధవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కశ్యప్‌ ఏర్పాటు చేసిన ప్రొడక్షన్‌ హౌస్‌ పాంథమ్‌ ఫిల్మ్‌ భాగస్వాములుగా ఉన్న వారందరిపైనా ఆదాయ పన్ను శాఖ దాడులకు దిగింది. అనురాగ్‌ కశ్యప్‌ మరికొందరితో కలిసి పాంథమ్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ను ఏర్పాటు చేసి కొన్ని చిత్రాలను నిర్మించారు. 2018లో ఈ ప్రొడక్షన్‌ కంపెనీని మూసేశారు. ఈ కంపెనీలో భాగస్వాములుగా ఉన్న దర్శక నిర్మాత విక్రమాదిత్య, నిర్మాత వికాస్‌ బహల్, నిర్మాత పంపిణీదారుడు మధుమంతేనాలపై దాడులు చేశారు. ఏకకాలంలో ముంబై, పుణేలోని 30 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కంపెనీకి సహ ప్రచారకుడిగా వ్యవహరించినందుకే మధు మంతేనా నివాసంలో సోదాలు నిర్వహించినట్టుగా ఆదాయ పన్ను శాఖ వర్గాలు వెల్లడించాయి.

మోదీ ప్రభుత్వ వ్యతిరేక గళం విప్పినందుకేనా ..?  
ఇటీవల కాలంలో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా తాప్సీ పలు ట్వీట్లు చేశారు. సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలు హోరెత్తిపోయినప్పుడు కశ్యప్‌ జేఎన్‌యూ, షాహిన్‌బాగ్‌లను సందర్శించి తన సంఘీభావం ప్రకటించారు. మోదీ ప్రభుత్వ వ్యతిరేక గళాలను అణచివేయడానికే ఈ సోదాలు జరిపారని మహారాష్ట్ర మంత్రులు ఆరోపణలు గుప్పించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, సీబీఐ, ఐటీ శాఖ వంటివన్నీ ప్రభుత్వ వ్యతిరేకుల్ని లక్ష్యంగా చేసుకుని పని చేస్తూ ఉంటాయని ఎన్సీపీ నాయకుడు నవాబ్‌ మాలిక్‌ ఆరోపించారు. నిజాలు మాట్లాడే వారిపై ఒత్తిడిని పెంచి వారిని మాట్లాడనివ్వకుండా కేంద్రసర్కార్‌ చేస్తోందని కాంగ్రెస్‌ నేత అశోక్‌ చవాన్‌ ఆరోపించారు.

మరిన్ని వార్తలు