2020లో 1.53 లక్షల ఆత్మహత్యలు

30 Oct, 2021 05:03 IST|Sakshi

సాగు రంగంలో 10 వేల బలవన్మరణాలు

ఎన్‌సీఆర్‌బీ వార్షిక నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో రోజుకు 418 చొప్పున మొత్తం 1,53,052 బలవన్మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో వ్యవసాయ రంగానికి చెందిన 10,677 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు పేర్కొంది. అంతకుముందు, 2019 సంవత్సరంలో మొత్తం 1,39,123 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) తన వార్షిక నివేదికలో తెలిపింది.

ఆత్మహత్యల రేటు ప్రతి వెయ్యి మందికి 2019లో 10.4% ఉండగా 2020లో అది 11.3%కి పెరిగిందని కేంద్ర హోం శాఖ అధీనంలో పనిచేసే ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది. 2020లో వ్యవసాయ రంగానికి చెందిన 10,677 మంది ఆత్మహత్య చేసుకోగా అందులో 5,579 మంది రైతులు, 5,098 మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారనీ, మొత్తం 1,53,052 ఆత్మహత్యల్లో 7% మంది సాగు రంగానికి చెందిన వారేనని విశ్లేషించింది.

బలవన్మరణం చెందిన 5,579 మంది రైతుల్లో పురుషులు 5,335 మంది, 244 మంది మహిళలు ఉన్నట్లు తెలిపింది.  ఆత్మహత్యల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 19,909, ఆతర్వాత తమిళనాడులో 16,883, మధ్యప్రదేశ్‌లో 14,578, బెంగాల్‌లో 13,103, కర్ణాటకలో 12,259 చోటుచేసుకున్నట్లు వివరించింది. మొత్తం బలవన్మరణాల్లో ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి 50.1% వరకు ఉన్నాయి. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో మాత్రం మొత్తం బలవన్మరణాల్లో 3.1%మాత్రమే సంభవించాయని నివేదిక తెలిపింది. 

2020లో సంభవించిన బలవన్మరణాల్లో 23,885 కేసులు దేశంలోని 53 నగరాల్లోనే నమోదయ్యాయి. మెగా నగరాల్లో ఆత్మహత్యల రేటు 14.8% కాగా, జాతీయ స్థాయి ఆత్మహత్యల రేటు 11.3% కావడం గమనార్హం. మొత్తం ఆత్మహత్యల్లో కుటుంబసమస్యల కారణంగా 33.6%, వివాహ సమస్యలతో 5%, వ్యాధులతో 18% మొత్తం 56.7% సంభవించినట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక తెలిపింది. అదేవిధంగా, బలవంతంగా ప్రాణాలు తీసుకున్న వారిలో పురుషులు 70.9% కాగా, మహిళలు 29.1% మంది ఉన్నారని నివేదిక పేర్కొంది.

మరిన్ని వార్తలు