ఖతార్‌లో బిహార్‌ వ్యక్తిపై కాల్పులు

21 Nov, 2020 16:37 IST|Sakshi

దోహా/పట్నా: సెలవు అడిగాడన్న కారణంతో ఓ భారతీయ వ్యక్తిని అతడి యజమాని గన్‌తో కాల్చిన ఘటన ఖతార్‌ దేశ రాజధాని దోహాలో జరిగింది.  బిహార్‌లోని ఈస్ట్‌ చంపారన్‌ జిల్లా బేలా గ్రామానికి చెందిన 35ఏళ్ల హైదర్‌ అలీ ఉద్యోగ నిమిత్తం దోహాలో నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను చూసి రావడం కోసం సెలవు కావాలని యజమానిని అడగగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా గన్‌తో హైదర్‌ను షూట్‌ చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన అతన్ని సహచరులు దోహాలోని హమాద్‌ జనరల్‌ ఆస్పత్రిలో చేర్చారు. అక్టోబర్‌ 30న ఇండియా వచ్చేందుకు అతడు ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నాడని, అయితే ఆ ముందు రోజు 29న ఈ ఘటన జరిగినట్లు హైదర్‌ అలీ సోదరుడు అఫ్సర్‌ అలీ తెలిపాడు. దోహాలో నివసించే తమ బందువు జావేద్‌ ఫోన్‌ ద్వారా సమాచారం అందించాడని అఫ్సర్‌ తెలిపాడు. ఆ తర్వాత దోహాలో ఉన్న భారత దౌత్య కార్యాలయ అధికారి ధీరజ్‌ కుమార్‌ను ఫోన్‌లో సంప్రదించగా తమకు సహాయం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని ఆయన భరోసా కల్పించారని పేర్కొన్నాడు. హైదర్‌కు భార్య, ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు తెలిపాడు.

విషయం తెలిసినప్పటి నుంచి హార్ట్‌ పేషెంట్‌ అయిన తన తండ్రితో పాటు మొత్తం కుటుంబం షాక్‌లో ఉందన్నాడు. ప్రస్తుతం తన అన్న మంచానికే పరిమితమయ్యే దుస్థితి ఏర్పడిందని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వచ్చే సమాచారం కోసం ప్రతిరోజూ ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. కుటుంబ పోషణ కష్టతరంగా మారిందని, తన సోదరుడికి జరిగిన అన్యాయానికి ఖతార్‌ ప్రభుత్వం పరిహారం చెల్లించాలని అఫ్సర్‌ కోరుతున్నాడు. కాగా, హైదర్‌ గత ఆరేళ్లుగా దోహాలో వెల్డర్‌గా పని చేస్తూ.. అతడి యజమాని ఇంట్లో వ్యక్తిగత పనులు సైతం చేస్తున్నాడు. 2018 నుంచి అతడు ఇంటికి రాలేదని, ఇప్పుడు రావాలనుకుంటే ఇలా జరిగిందని అఫ్సర్‌ ఆవేదన వ్యక్త చేశాడు. కేరళలో పీహెచ్‌డీ చేస్తున్న అఫ్సర్‌ లాక్‌డౌన్‌ మెదలైనప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు.

మరిన్ని వార్తలు