ప్రాణాలు తీసిన ప్రాంక్‌ వీడియో.. ఫ్రెండ్‌ను ఫూల్‌ చేయబోయి విద్యార్ధి మృతి

2 Apr, 2024 20:07 IST|Sakshi

సోషల్‌ మీడియాలో ఈ మధ్య కాలంలో ప్రాంక్‌ల హవా బాగా నడుస్తోంది. కుటుంబ సభ్యులు, తెలిసిన వారికి ఏదైనా విషయం గురించి చెప్పి భయపెట్టడం.. తరువాత అదంతా ప్రాంక్‌ అని చెప్పడం ఫ్యాషన్‌గా మారింది. అయితే కొన్ని సార్లు ఈ చర్యలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ప్రాంక్ మోజులో పడి అనేక మంది యువత తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు.

తాజాగా ఏప్రిల్‌ ఫూల్స్‌ డే రోజు చేసిన​ తన స్నేహితుడిని ప్రాంక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఇండోర్‌లోని మల్హర్‌గంజ్‌లో 11వ తరగతి చదువుతున్న అభిషేక్‌ అనే విద్యార్ధి సోమవారం ఏప్రిల్స్‌ ఫూల్స్‌డే రోజు తన స్నేహితుడిని ప్రాంక్‌ చేయాలని ప్రయత్నించాడు. ఫ్రెండ్‌కు వీడియో కాల్‌ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నటించాడు. స్టూల్‌పై నిల్చొని మెడకు తాడు బిగించి తను చనిపోతున్నట్లు స్నేహితుడిని నమ్మించాడు.

ఈ క్రమంలో అనుకోకుండా స్టూల్‌ జారిపోవడంతో మెడకు తాడు బిగుసుకుపోయి మృతి చెందాడు. ఈ సంఘటనను చూసిన వెంటనే స్నేహితుడు.. అభిషేక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అదనపు డీసీపీ రాజేష్ దండోటియా తెలిపారు.
చదవండి: విషాదం: ఫార్చ్యూనర్ కోసం ‘కరిష్మా’కు భవిష్యత్తే లేకుండా చేశారు

గమనిక: దయచేసి ఎవరూ ఇలాంటి ప్రాంక్‌లు ప్రయత్నించవద్దు. చిన్న చిన్న సరదాలకు పోయి..  నిండు ప్రాణాలను బలితీసుకోవద్దు

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers