లోన్‌ యాప్‌.. కటకటాల్లోకి బెంగళూరు కీర్తి

5 Jan, 2021 10:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఎన్యూ టెక్నాలజీస్‌కు హెచ్‌ఆర్‌ మేనేజర్‌ 

రూ.100 కోట్లు దాటిన ఫ్రీజింగ్‌ మొత్తాలు 

సాక్షి, బెంగళూరు: అక్రమ మైక్రో ఫైనాన్సింగ్‌కు పాల్పడిన లోన్‌ యాప్స్‌ కేసులో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మరో యువతిని అరెస్టు చేశారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన ఎన్యూ టెక్నాలజీస్‌ సంస్థ హెచ్‌ ఆర్‌ విభాగం మేనేజర్‌ కీర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌ తీసుకువచ్చారు. ఈ సంస్థకు హెడ్‌గా వ్యవహరించిన సూత్రధారి నాగరాజు సోదరుడు ఈశ్వర్‌ను గత వారమే అరెస్టు చేశారు. అప్పటినుంచి పరారీలో ఉన్న కీర్తి కోసం గాలించిన ప్రత్యేక బృందం ఆదివారం పట్టుకోగలిగింది. ఈ ద్ఙారుణ’ యాప్స్‌ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన, ఇండోనేషియా కేంద్రంగా కార్యకలాపాలు నడిపిన చైనీయురాలు యాన్‌ యాన్‌ అలియాస్‌ జెన్నీఫర్‌తో ఈమె నేరుగా సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. ఆమెతో వాట్సాప్‌ ద్వారా తరచు సంప్రదింపులు జరిపినట్లు పేర్కొంటున్నారు. (చదవండి: లోన్‌ యాప్‌.. కటకటాల్లోకి చైనీయులు)

లోన్‌ యాప్స్‌ వేధింపులకు సంబంధించి సిటీలో ఇప్పటి వరకు 28 కేసులు నమోదు కాగా... చైనీయుడితో సహా 17 మందిని అరెస్టు చేశారు. 27 బ్యాంకు ఖాతాలతో సహా వర్చువల్‌ ఖాతాల్లో ఉన్న రూ.100 కోట్లకు పైగా మొత్తాన్ని ఫ్రీజ్‌ చేశారు. ఈ లోన్‌ యాప్స్‌కు ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరుల్లో ఉన్న మరికొన్ని కంపెనీలతోనూ లింకులు ఉన్నట్లు గుర్తించారు. వాటి వ్యవహారాలను దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. వీటి ఏర్పాటులో కీలకమైన చైనీయులు వివిధ నగరాల్లో ట్రాన్స్‌లేటర్లను ఏర్పాటు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్లు, బ్యాంకు ఖాతాల తెరవడం తదితర సందర్భాల్లో వీరి సేవల్ని వినియోగించుకున్నట్లు తెలిపారు. ఢిల్లీకి చెందిన ట్రాన్స్‌లేటర్‌ ఇంద్రజిత్‌ను గుర్తించిన పోలీసులు మిగిలిన ప్రాంతాల్లో ఉన్న వారి ఆచూకీ కనిపెట్టి వాంగ్మూలాలు నమోదు చేయాలని నిర్ణయించారు. వీరి ద్వారా చైనీయులు కార్యకలాపాలకు సంబంధించి కీలక సమాచారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. (చదవండి: ఇన్‌స్టంట్‌ లోన్స్‌తో ఈ అనర్థాలు తప్పవు)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు