ఆ కాలేజీకి వెళ్లను.. అంతలోనే విషాదం.. తమ్ముడిని చూసి ఒక్కసారిగా..

23 Jan, 2022 08:26 IST|Sakshi
యశ్వంత్‌(ఫైల్‌)

వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): కళాశాలకు వెళ్లనన్న తనయుడిని తల్లిదండ్రులు మందలించడంతో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. వెంగారెడ్డికండ్రిగ దళితవాడకు చెందిన కొమ్మల మునివెంకటయ్య, ధనమ్మ దంపతులకు కుమార్తె షాలిని, కుమారుడు యశ్వంత్‌ ఉన్నారు. షాలిని నర్సింగ్‌ చేస్తుండగా యశ్వంత్‌ తిరుపతిలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ (ఎంపీసీ )ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన యశ్వంత్‌ ఈ నెల 24 నుంచి కళాశాలకు హాజరు కావాల్సి ఉంది.

చదవండి: ఉమెన్స్‌ బ్యూటీ పార్లర్‌.. ఆమె డాబూ దర్పం చూసి.. చివరికి లబోదిబో..

తాను ఆ కళాశాలకు వెళ్లేదిలేదని మొండికేశాడు. అయితే ఇప్పటికే ఫీజు చెల్లించేశామని, ఆ కళాశాలకే వెళ్లాలని శనివారం ఉదయం తల్లిదండ్రులు మందలించారు. తరువాత ఉద్యోగరీత్యా వారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ సమీపంలోని అపాచీ పరిశ్రమకు వెళ్లారు. అక్క షాలినితో కలసి యశ్వంత్‌ ఇంటిలోనే ఉన్నాడు. అయితే ఉదయం అక్క పొలం వద్దకు వెళ్లిన సమయంలో యశ్వంత్‌(16) ఇంటిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. 10గంటల సమయంలో ఇంటికి వచ్చిన షాలిని, ఉరేసుకున్న తమ్ముడిని చూసి ఒక్కసారిగా కేకలు పెట్టింది. స్థానికులు గుమికూడి 108కు సమాచారమివ్వడంతో, వారు సత్యవేడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ హనుమంతప్ప తెలిపారు. 

మరిన్ని వార్తలు