ఫెయిల్‌ అవుతాననే భయంతో.. 

29 May, 2022 02:34 IST|Sakshi

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య  

జగిత్యాలక్రైం: వార్షిక పరీక్షలు సరిగా రాయలేదని, దీంతో ఫెయిల్‌ అవుతాననే భయంతో ఇంటర్‌ విద్యార్థి ద్యాగల సంజయ్‌కుమార్‌(19) శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని లింగంపేటలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. లింగంపేటకు చెందిన సంజయ్‌కుమార్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌(సీఈసీ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు హాజరయ్యాడు. అయితే, పరీక్షలు సరిగా రాయలేదని కొద్దిరోజులుగా మానసికంగా కుంగిపోతున్నాడు. ఇంట్లో ఎవరితోనూ మాట్లాడటంలేదు. పరీక్షల్లో ఫెయిలైనా ఏమీకాదని కుటుంబసభ్యులు ధైర్యం చెప్పినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి భోజనం చేశాక తన గదిలోకి వెళ్లాడు.

శనివారం ఉదయం వరకూ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు..గది వెనకాల ఉన్న కిటికీలోంచి చూడగా.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి లక్ష్మీరాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కిశోర్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు